ఏలూరులో అంతు చిక్కని వ్యాధి.. 100 మందికి పైగా అస్వస్థత

ఏలూరులో అంతు చిక్కని వ్యాధి.. 100 మందికి పైగా అస్వస్థత

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఒక్కసారిగా 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు, కళ్లు తిరగడం,వాంతులు ,సొమ్మసిల్లి వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు.  వీరిలో 20 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఇవాళ పరీక్షల ఫలితాలు వచ్చాకే రోగ నిర్ధారణ అవుతుంది.  అత్యవసరమైతే బాధితులను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రేగు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. ఏలూరుకు వైద్య బృందాలను పంపించారు.

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఘటనపై మంత్రి నానిని  సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.  ప్రమాదానికి కారణాలు తెలియకపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.