22 వేలకు పైగా బాండ్లు జారీ

22 వేలకు పైగా బాండ్లు జారీ
  •      సుప్రీంకోర్టుకు అఫిడవిట్​లో​వెల్లడించిన ఎస్​బీఐ చైర్మన్​
  •     ఈసీకి పూర్తి వివరాలు పంపించినట్లు కోర్టుకు వివరణ

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి పూర్తి వివరాలను ఎస్ బీఐ ఎన్నికల సంఘానికి అందజేసింది. 2019 ఏప్రిల్​1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 22,217 బాండ్లు జారీ చేశామని, అందులో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు రిడీమ్ చేసుకున్నాయని తెలిపింది. గడువు ముగిసినా రిడీమ్ చేసుకోని 187 బాండ్లకు చెందిన మొత్తాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి జమచేసినట్లు వివరించింది. ఈమేరకు ఎస్​బీఐ చైర్మన్ దినేశ్​కుమార్ ఖారా బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్​ దాఖలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి.. బాండ్ జారీ చేసిన తేదీ, కొన్న వారి పేరు, బాండ్ వాల్యూ, రాజకీయ పార్టీ పేరు, ఏ తేదీన రిడీమ్ చేసుకున్నది.. తదితర వివరాలను ఎన్నికల సంఘానికి అందజేసినట్లు అఫిడవిట్​లో పేర్కొన్నారు.

అఫిడవిట్​ లో పేర్కొన్న వివరాల ప్రకారం..

2019 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 11 వరకు.. కేవలం పది రోజుల వ్యవధిలో 3,346 ఎలక్టోరల్ బాండ్స్ అమ్ముడయ్యాయని, ఇందులో 1,609 బాండ్లను పార్టీలు రిడీమ్ చేసుకున్నాయని ఎస్ బీఐ చైర్మన్ దినేశ్​కుమార్ వెల్లడించారు. 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు మరో 18,871 బాండ్లు అమ్ముడయ్యాయని చెప్పారు. ఇదే కాలంలో మొత్తం 20,421 బాండ్లను రాజకీయ పార్టీలు రిడీమ్ చేసుకున్నాయని పేర్కొన్నారు. మిగతా 187 బాండ్ల గడువు ముగియడంతో ఆ బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేశామని వివరించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ నెల 12 (మంగళవారం) పని వేళలు ముగిసేలోగా ఎన్నికల సంఘానికి ఈ వివరాలను పెన్ డ్రైవ్​ లో అందజేశామని అఫిడవిట్​లో పేర్కొన్నారు.