
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పక్షాల రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జ్ అమిత్ మాల్వియా, బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ పై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
బీజేపీ కాంగ్రెస్‌ను ఒక నిర్దిష్ట మతానికి అనుకూలమైన పార్టీగా చిత్రీకరిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై కాంగ్రెస్ వైఖరి గురించి అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఫిర్యాదు ఆరోపించింది. అంతేకాకుండా, ఎస్సీ/ఎస్టీ వర్గాన్ని కించపరిచే విధంగా బీజేపీ ప్రొజెక్ట్ చేసిందని తెలిపింది.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్‌కు చేసిన వివరణాత్మక ఫిర్యాదులో.. బీజేపీ కర్ణాటక తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. "రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యల యానిమేటెడ్ పాత్రలను చిత్రీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను బుట్టలో గుడ్లుగా చూపింది. ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాహుల్ గాంధీ మరో గుడ్డును నాటుతున్నారని.. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను తొలగించారని చిత్రీకరించారు" అని తెలిపింది.
తాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను జాగ్రత్తగా పరిశీలించానని.. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలకు నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తామని, ముస్లిం సమాజానికి కూడా నిధులు కేటాయిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదని ఫిర్యాదులో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓబీసీ కేటగిరీలో చేరుస్తుందని బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, అలాంటి తప్పుడు ప్రచారంతో లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగారంటూ కాంగ్రెస్ నేత తన ఫిర్యాదులో వివరించారు.