హైదరాబాద్: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. దాదాపు ఐదు వందల మంది పోలీసులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
మసాజ్ సెంటర్స్.. ఇటీవలి కాలంలో వ్యభిచారానికి అడ్డాగా మారుతున్నాయి. పైకి మసాజ్ సెంటర్, స్పా పేరిట బోర్డులు పెట్టి లోపల యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే మసాజ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ మసాజ్ సెంటర్ల ఆగడాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు మసాజ్ సెంటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే మసాజ్ సెంటర్లు, స్పాల ఆట కట్టించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు.
మసాజ్ సెంటర్ల నిర్వహణ విషయంలో ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్స్లో తనిఖీలు:
* 500 మంది పోలీసులతో 113 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు
* స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఫోకస్
* కస్టమర్ల వివరాల రిజిస్టర్లు నిర్వహించని పలు స్పా సెంటర్లు గుర్తింపు
* నిబంధనల ఉల్లంఘనలపై నిర్వాహకులను ప్రశ్నిస్తున్న పోలీసులు
* స్పా సెంటర్లకు భవనాలు అద్దెకు ఇచ్చిన యజమానులపైనా విచారణ
* భవనాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోని ఓనర్లపై పోలీసుల ఆరా
* అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా సమాచారం ఇవ్వని భవన యజమానులు
* కమిషనరేట్ వ్యాప్తంగా కొనసాగుతున్న విస్తృత తనిఖీలు
* స్పా సెంటర్ల కార్యకలాపాలపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్న పోలీసులు
