HYD: కూకట్ పల్లిలో విషాదం..ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

HYD:  కూకట్ పల్లిలో విషాదం..ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధ ఘటన చోటుచేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో  కన్నతల్లే కాలయముడుగా మారి తన ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకుని ఆపై తానూ ప్రాణాలు తీసుకుంది.

 ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. రాఘవేంద్ర కాలనీలో నివసించే ఓ మహిళ, తన ఇద్దరు కుమారులను గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


తల్లి స్రవంతి, కుమారులు కౌశిక్ , కార్తీక్ గా పోలీసులు గుర్తించారు.  భర్త ప్రవీణ్ తో కలిసి నివాసముంటుంది కుటుంబం.  కుటుంబంలో  నెలకొన్న కారణాలతోనే  స్రవంతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.   భర్త ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నదని స్థానికులు చెబుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.