జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పునిచ్చింది కోర్టు. 2020లో మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై బుధవారం ( జులై 15 ) తీర్పు వెల్లడించింది కోర్టు.ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు.. వారికీ జీవిత ఖైదు విధించింది.
అంతే కాకుండా.. ఒక్కో దోషికి రూ.20 వేల జరిమానా విధించిన కోర్టు.. బాధిత మైనర్ బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పటిష్ట ఆధారాలతో పోలీసులు, ప్రాసిక్యూషన్ కేసు నిరూపించడంతో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి రత్న పద్మావతి కీలక తీర్పు వెల్లడించారు.
ఇటీవల షాబాద్ లో పోక్సో కేసు నిందితుడు బెయిల్ పై వచ్చి మారణకాండ సృష్టించి చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన క్రమంలో జగిత్యాల పోక్సో కేసు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. పోక్సో కేసు నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా... వీలైనంత త్వరగా కేసు నిరూపించి శిక్ష విధించాలని కోరుతున్నారు జనం.
