అమెరికాలో దారుణం జరిగింది. నువ్వు ముస్లిమా అని అడిగి.. ఓ భారతీయ వ్యక్తిని 15 సార్లు కత్తితో పొడిచి చంపాడు దుండగుడు. సోమవారం ( జులై 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలోని ఉటాలో వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్ లో దారుణం జరిగింది. మాల్ లో పని చేస్తున్న సోహెల్ అనే ఉద్యోగిని మతం అడిగి 15 సార్లు కత్తితో పొడిచి చంపాడు పీటర్ మైఖేల్ లార్సెన్ అనే కిరాతకుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సెన్, బాధితుడు ముస్లిం అయినందున అతడిని ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని, తనకు ముస్లింలను చంపాలనే ఉద్దేశం ఉందని తెలిపారు పోలీసులు .
లార్సెన్ మాల్ లో ఉద్యోగి అయిన సోహెల్ దగ్గరికి వెళ్లి వాగ్వాదం మొదలుపెట్టి, దాడికి పాల్పడ్డాడని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. లార్సెన్ ను సాల్ట్ లేక్ కౌంటీ జైలుకు తరలించామని తెలిపారు పోలీసులు.
►ALSO READ | మన దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ పథకం: 62 వేల కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చేశారు..!
లార్సెన్ సోహెల్ దగ్గరికి వెళ్లి నువ్వు ఎక్కడి వాడివి అని అడుగగా, నేను ఇండియన్ ని నా పేరు సోహెల్ అని అతడు జవాబిచ్చాడని... లార్సెన్ నువ్వు ముస్లింవా అని అడగగా సోహెల్ అవునని చెప్పాడని... ఆ తర్వాత కత్తితో పొడిచి చంపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఘటన జరిగిన సమయంలో మాల్ లో ఉన్నవారు లార్సెన్ ఆపేందుకు ప్రయత్నించారని.. అయితే అప్పటికే సోహెల్ ను 15 సార్లు కత్తితో పొడిచేశాడని తెలిపారు. ఆ తర్వాత కొంతమంది లార్సెన్ ను పట్టుకొని కిందపడేయడంతో దాడి ఆపేశాడని తెలిపారు.
