మన దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ పథకం: 62 వేల కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చేశారు..!

మన దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ పథకం: 62 వేల కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చేశారు..!

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన పథకం తీసుకొచ్చింది. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కోసం రాబోయే ఐదేళ్లల్లో.. అంటే 2031 సంవత్సరం వరకు.. ఈ మొబైల్ ఫోన్ల తయారీ పథకం కింద అక్షరాల 62 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మొబైల్ ఫోన్ తయారీ పథకం (MPMS)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రూ. 62 వేల 500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో మొబైల్ ఫోన్ తయారీ పథకం (MPMS)కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మన దేశంలో ఇప్పటికీ బడ్జెట్ మొబైల్స్ గానీ, ప్రీమియం మొబైల్స్ గానీ చైనా, అమెరికా.. ఇలా ఇతర దేశాలకు చెందిన మొబైల్ ఫోన్లే వినియోగంలో ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే దేశీయ మొబైల్స్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారత్ సాంకేతికంగా ఎంత వృద్ధి పథంలో ముందుకెళుతున్నా ఇండియన్ మొబైల్ మార్కెట్లో మాత్రం వెనుకబడే ఉంది.

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. R&D రంగాలలో భారతీయ పేటెంట్లను సృష్టించడం కోసం, ఇండియన్ మొబైల్ బ్రాండ్స్ను విరివిగా పెంచి గ్లోబల్ మార్కెట్లో కూడా సత్తా చాటడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ MPMS పథకం తీసుకొచ్చింది. ఈ స్కీం కాలపరిమితి 5 సంవత్సరాలు. అనగా 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030--31 ఆర్థిక సంవత్సరం వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా సుమారు 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు కూడా దక్కుతాయని.. తద్వారా ఉపాధి కల్పనలో అవకాశాలను మెరుగుపరచొచ్చని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.

►ALSO READ | భారత్‌ న్యూక్లియర్ ప్లాంట్‌ ఫైల్స్ లీక్.. కుడంకుళంపై సైబర్ దాడి..?

అంతేకాదు.. ఈ పథకంలో మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన ముడి సరుకు అమ్మకాలపై 2.25% నుంచి 5% వరకు వేర్వేరు రేట్లలో ప్రోత్సాహక మద్దతును అందిస్తుంది. కీలకమైన భాగాలు/సబ్-అసెంబ్లీల దేశీయ సోర్సింగ్‌కు అనుసంధానంగా ఈ పథకం 1.5% వరకు అదనపు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తుంది. భారతీయ బ్రాండ్‌లను నిర్మించడానికి, ఉత్పత్తి యొక్క డిజైన్, R&D కోసం అర్హత గల అమ్మకాలపై 3% చొప్పున అదనపు ప్రోత్సాహకం లభిస్తుంది.