తెలంగాణ, జర్మనీలోని తూరంగియా రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, థురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
జర్మనీ తురింగియా రాష్ట్ర సీఎం మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో బుధవారం ( జూన్ 3 ) ప్రత్యేకంగా సమావేశం కాగా, ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని... ముఖ్యంగా ఏఐ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాల స్థానంలో కొత్త అవకాశాలు వస్తున్నాయని అన్నారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీలు), పాలిటెక్నిక్ కళాశాలల్లో బోధన విధానాలను మార్చేందుకు తురింగియా సహకారం కావాలని కోరారు.
సీఎం రేవంత్వ్యాఖ్యలకు స్పందించిన... తురింగియా సీఎం మారియో వోయిట్... తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రూపొందించేందుకు తమ పరిశ్రమలు, విద్యాసంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జర్మనీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఏమిటో గుర్తించి, వాటికి అనుగుణంగా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా ఇప్పటికే జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయని తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో యువతకు అత్యాధునిక నైపుణ్యాలు అందిస్తున్నామని, తురింగియా ప్రతినిధులు ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా వెళ్లి పరిశీలించవచ్చని సూచించారు.
పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో తెలంగాణకు కొత్త అవకాశాలు అందజేయనున్న ఈ ఒప్పందం రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందించే దిశగా కీలక అడుగుగా మారనుందని... సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుండగా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల రాష్ట్రాలు తెలంగాణతో భాగస్వామ్యం కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని అన్నారు.
సెమీకండక్టర్ రంగంలో కొత్త అవకాశాలు
తురింగియా సీఎం మాట్లాడుతూ సెమీకండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడి అవకాశాలను పరిశీలించి పెట్టుబడులపై చర్చలు జరుపుతామన్నారు.
అయితే, ఈ ప్రతిపాదనను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్వాగతిస్తూ ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక అంతర్జాతీయ సెమీ కండక్టర్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే తయారీ రంగంలో కూడా తెలంగాణ ముందంజలో నిలుస్తుందని తెలిపారు.
తెలంగాణ ప్రగతికి జర్మనీ కితాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిశీల పనులను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సమావేశంలో తురింగియా సీఎం మారియో వోయిట్ తెలంగాణను భారతదేశంలో అభివృద్ధి, ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన "తెలంగాణ రైజింగ్ - 2047" విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
తెలంగాణ సాధించిన అభివృద్ధి ప్రత్యేకమైనదిగా వ్యాఖ్యానించారు. భారత-జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని... ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు గౌరవంగా ఉందని వివరించారు. రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
