ఆ రాక్షసులపై జాలి చూపడం ఎందుకు?

ఆ రాక్షసులపై జాలి చూపడం ఎందుకు?
  • దిశ ఘటన ఖండించిన మా అసోసియేన్
  • న్యాయం జరగాలని డిమాండ్
  • కొవ్వొత్తులతో ర్యాలీ 

దిశ కేసులో న్యాయం జరగాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బాధితురాలికి జరిగిన దారుణానికి నిరసనగా హైదరాబాద్ ఫిలిం చాంబర్ నుంచి కల్చరల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అసోసియేషన్ ప్రతినిధులు. ఇలాంటి సంఘటనల్లో ప్రభుత్వాలు కఠినంగా ఉండాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్,మురళీ మోహన్, పరుచూరి గోపాలకృష్ణ, బాబు మోహన్, రాజశేఖర్, జీవిత, బెనర్జీ పాల్గొన్నారు.

మురళీమోహన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు  ఎక్కువ రోజులు కేసులు ఉండకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నెల రెండు నెలల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు. గతంలో ఇలాంటి ఓ కేసులో ఓ SP ధైర్యంగా నిందితులను ఎంకౌంటర్ చేశారని, రూల్ ప్రకారం అది తప్పే అయినా ప్రజలు హర్షించారన్నారు.

వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కఠిన నియమాలను అమలు చేసి,నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. చట్టాలను కఠినతరం చేస్తే ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారన్నారు.

నిందితుల తల్లిదండ్రులే చంపేయాలని అంటున్నప్పుడు.. పోలీసులు, ప్రభుత్వానికి వారిపై జాలి ఎందుకు కలుగుతుందో అని నటుడు బాబుమోహన్ ప్రశ్నించారు. దిశ కుటుంబానికి జరిగిన దారుణం వారికి కుటుంబానికి జరిగి ఉంటే ఆ బాధేంటో తెలిసేదని అన్నారు. నిందితులను బతుకనివ్వాలని జాలి చూపేవాళ్లు అసలు మనుషులే కాదని అన్నారు.