
తన తండ్రి డీఎస్ మృతిపట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ అయ్యారు. అన్నా అంటే నేనున్నానని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాతోనే ఉంటావు ఎప్పటికీ నాలోనే ఉంటావని అర్వింద్ తన ఎక్స్ లో కన్నీటి పర్యంతమయ్యారు.
1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నుంచి మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో 2004, 2009లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 లో బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2023లో మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన రెండో కొడుకు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. జూన్ 30న నిజామాబాద్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.