గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

టీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం తప్పదు

ఎంపీ బండి సంజయ్ కామెంట్స్

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలలో కోట్ల రూపాయలు సంపాదించుకుని, ఆ డబ్బులు లెక్క పెడుతూ కేటీఆర్ కు మతిమరుపు వచ్చిందన్నారు ఎంపీ బండి సంజయ్. అందుకే నడ్డాను మర్చిపోయి ఆయనెవరో తెలియదంటూ నోరు జారారని ఆయన అన్నారు. నడ్డా మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో యూత్ తిప్పికొట్టిందని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ మిన్నుకుండి పోయారన్నారు. ఇలా వారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్న యువకులపై కేసులు పెడతామని, ఉద్యోగాలు రావని, పీడీ యాక్ట్  పేరుతో బెదిరిస్తూ టిఆర్ఎస్ పార్టీ నీచ స్థాయికి దిగజారిందని ఎంపీ అన్నారు.

ప్రస్తుతం కేటీఆర్ సీఎం పీఠం కోసం ప్రయత్నిస్తున్నారని, ఆయన తండ్రి కేసీఆర్ కు మాత్రం తన కొడుక్కి సీఎం పీఠం ఇస్తే ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో అని భయపడుతున్నారని బండి సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం కావాలనే పదే పదే తప్పులు చేసిందని ఎంపీ ఆరోపించారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బీజేపీకి పట్టు ఉంటుందని,  అక్కడి ప్రజలు BJP కి అండగా నిలుస్తారని భావించే.. గ్రామాల విలీనం, వార్డుల విభజన, రిజర్వేషన్లు అంటూ  గందరగోళం సృష్టించి ఎన్నికలు జరపకుండా ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలన మీద నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడం టీఆర్ఎస్ కు కొత్తదేమీ కాదని ఆయన అన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వకుండా వారు గొడవ పడుతుంటే సీఎం సంతోషిస్తూ కాలక్షేపం చేస్తున్నాడన్నారు.

మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చనిపోతే  కనీసం పరామర్శ కానీ, సంతాపం కూడా కేసీఆర్ తెలుపలేదని, అంతిమ యాత్రలో పాల్గొనడానికీ కూడా ఆయన  తీరిక లేదంటూ ఎంపీ ఎద్దేవా చేశారు.  27 మంది పేద ఇంటర్ విద్యార్థులు చనిపోయనా, కొండగట్టు బస్సు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోయినా వారి కుటుంబాలకు పరామర్శించి,  ఆదుకునేందుకు ముందుకు రాని సీఎం కేసీఆర్…  పెద్దోళ్ళు చనిపోతే మాత్రం మేకప్ వేసుకుని కొత్త డ్రెస్సులతో వెళ్లడానికి ముందు ఉంటారన్నారు. తాను కేసీఆర్ పరామర్శలకు వ్యతిరేకం కాదు కానీ, పేద కుటుంబాల వారిని కూడా ఆదుకోవాలన్నదే తన అభిమతమన్నారు.

నేడు టీఆర్ఎస్ పార్టీలో అందరు తెలంగాణ ద్రోహులేనని, ఉద్యమంలో పాల్గొనని వారంతా మంత్రులుగా చలామణి అవుతున్నారని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా అభద్రతా భావంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పాలన కొనసాగుతుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, గ్రానైట్, అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో జరుగుతున్న అవినీతి ఆధారాలతో సహా బయట పెడతామని, టీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ పోరాటం చేస్తుందని, యుద్ధానికి బీజేపీ సిద్ధమన్నారు. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ అవినీతి బండారం బయట పెడతామని ఎంపీ అన్నారు.

టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడే పార్టీ  బీజేపీ కాదని, అనేకమంది బీజేపీ కార్యకర్తలు లాఠీలు, కేసులు, జైళ్లకు దేనికైనా భయపడకుండా, నమ్మిన సిద్ధాంతం కోసం మోడీ, అమిత్ షా, నడ్డా నాయకత్వంలో ముందుకెళుతున్నారన్నారు ఎంపీ సంజయ్. ఈ నిజాన్ని గ్రహించిన ప్రజలు బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారు.  2023 లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, గోల్కొండ ఖిల్లా మీద కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా  పాలన కొనసాగిస్తామని ఎంపీ అన్నారు.