ఈసీ కళ్లు మూసుకుంది: బీజేపీ కూటమి అభ్యర్థుల ఏకగ్రీవంపై MP ప్రియాంక చతుర్వేది హాట్ కామెంట్స్

ఈసీ కళ్లు మూసుకుంది: బీజేపీ కూటమి అభ్యర్థుల ఏకగ్రీవంపై MP ప్రియాంక చతుర్వేది హాట్ కామెంట్స్

ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలకు ముందు 68 మంది అధికార మహాయుతి కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం కావడంపై శివసేన (యుబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది హాట్ కామెంట్స్ చేశారు. ఈసీ, మహాయుతి కూటమి టార్గెట్‎గా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. పోటీ లేకుండా 68 మంది అధికార కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ప్రజాస్వామ్యానికి ఒక చెత్త ఉదాహరణగా అభివర్ణించారు. ఓటర్ల ప్రాథమిక హక్కును కాలరాస్తు్న్నారని నిప్పులు చెరిగారు. ఓటర్లు తమ అభ్యర్థిని ఎన్నుకునే హక్కును అణచివేస్తున్నారని మండిపడ్డారు. 

ఎన్నికల సంఘం కళ్లు మూసుకుని కూర్చుందని.. అభ్యర్థులు పోటీ లేకుండా గెలుపొందడంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈసీ, బీజేపీ కుమ్మక్కై పరోక్షంగా రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఈడీ, సీబీఐ పేరుతో ప్రతిపక్షాలను బెదిరిస్తుందని.. బెదిరింపులకు లొంగని వారికి డబ్బు ఆశ చూపి పోటీ నుంచి పక్కకు తప్పిస్తోందని ఆరోపించారు.

కాగా, 2026, జనవరి 15న మహారాష్ట్ర పౌర (మున్సిపల్) ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ముందే అధికార మహాయుతి కూటమి 68 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఏకగ్రీవమైన 68 స్థానాల్లో బీజేపీ 44 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అభ్యర్థులు 22 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు చోట్ల యునానిమస్ అయ్యారు. అత్యధికంగా థానే జిల్లాలోని కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్, పూణే, పింప్రి చించ్వాడ్, పన్వెల్, భివాండి, ధూలే, జల్గావ్, అహల్యానగర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.