బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య
  •     రాజ్యసభలో ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా ఓబీసీల సంక్షేమం కోసం కేంద్ర కేబినెట్ లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్. కష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన రాజ్యసభలో చైర్మన్ అనుమతితో ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, ఇతర అనేక సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు. 

అలాగే.. క్రీడలు, సాంస్కృతిక రంగం, ఇతర విభాగాలకు ప్రత్యేక మంత్రి విభాగాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తాజాగా ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా తీసుకు వచ్చినట్లు చెప్పారు. కానీ దేశ జనాభాలో 56 శాతమున్న ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం శోచనీయమన్నారు. 

కేంద్ర స్థాయిలో బీసీలకు ఉపాధి, విద్యలో 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. జాతీయ బీసీ కమిషన్, జాతీయ బీసీ కార్పొరేషన్ ఉన్నాయని... 15 ఏండ్ల కింద బీసీ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే, బీసీ రిజర్వేషన్లు, ఇతర సమస్యలపై అనేక చట్టపరమైన వివాదాలు తలెత్తుతున్నట్లు సభ్యులకు వివరించారు. అందువల్ల రాష్ట్రాలను సమన్వయం చేయడానికి ఆయా వర్గాల అభివృద్ధి–సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమని స్పష్టం చేశారు.