సిద్దిపేట, వెలుగు: ఏర్పాటైన తక్కువ కాలంలోనే బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో ఆయన మాట్లాడారు.
‘దేశమే ప్రథమం’ అనే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శిక్షణ తరగతుల్లో పాల్గొని పార్టీ సిద్ధాంతాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మనల్ని మనమే అప్డేట్ చేసుకుంటే మంచి స్థాయికి ఎదగవచ్చన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో గతంతో పోల్చితే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేశ్గౌడ్, చింత సంతోశ్, తుంగ కనకయ్య, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
