సోంపు గింజలు తినే ఉంటారు. హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో భోజనం చేశాక చాలా మంది వీటిని తింటుంటారు. కానీ.. ఇళ్లలో లంచ్, డిన్నర్ తర్వాత కూడా ఈ సోంపు గింజలను తినాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సౌరభ్ సేథి సూచించారు. భోజనం చేశాక సోంపు తినడాన్ని అలవాటుగా మార్చుకోవాలని ఆయన చెప్పారు. ఇలా సోంపు గింజలను తినడం వల్ల జీర్ణ క్రియకు సాఫీగా ఉంటుందని.. కడుపు ఉబ్బరం అనే సమస్య తలెత్తదని ఆయన చెప్పారు. పేగు ఆరోగ్యాన్ని కాపాడటంలో సోంపు గింజలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
మనలో కొంతమందికి భోజనం చేశాక.. కడుపు ఉబ్బరంగా అనిపించడం, గ్యాస్ వల్ల ఇబ్బందిపడటం లాంటి సమస్యలు సహజంగానే ఉంటాయి. ఇలాంటి వాళ్లు తప్పక సోంపు గింజలను తినాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు. తినమన్నారు కదా అని గుప్పెళ్లకు గుప్పెళ్లు నమలడం కాకుండా తక్కువ మోతాదులో సోంపు గింజలను తినాలని సూచించారు. సోంపు గింజలలో ఫైబర్, అనెథోల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల, ఇవి ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. భోజనం తర్వాత వీటిని నమలడం వల్ల శ్వాస తాజాగా ఉంటుంది. ప్రతిరోజు భోజనం చేశాక సోంపు గింజలు తినాలని జీర్ణాశయ వైద్య నిపుణులు చెబుతున్నారు.
సోంపు గింజలను నమలడం వల్ల దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కొని లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వీటిలో ఉండే సుగంధ తైలాలు సహజంగా నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సౌరభ్ సేథి వీడియోలో వివరించారు. డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్న వివరాల ప్రకారం.. సోంపుకు తేలికపాటి యాంటిస్పాస్మోడిక్ లక్షణం ఉంటుంది. ఇవి కడుపు తిమ్మిర్లు, ప్రేగుల అసౌకర్యాన్ని తగ్గించగలవు.
గ్యాస్‌ను తగ్గించి.. ఉబ్బరం నుంచి ఉపశమనం ఇస్తాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌లు, జీర్ణరసాల స్రావాన్ని ప్రేరేపించి, ఆహారం త్వరగా అరగడానికి సోంపు గింజలు సాయపడతాయి. ప్రతి రోజు భోజనం చేశాక ఒక టీస్పూన్ సోంపు గింజలు నమిలితే మంచిదని జీర్ణాశయ వైద్య నిపుణులు చెబుతున్నారు.
