SRH vs BCCI: మూడు మ్యాచ్లలో వివాదాలు.. బీసీసీఐకి SRH కంప్లైంట్

SRH vs BCCI: మూడు మ్యాచ్లలో వివాదాలు.. బీసీసీఐకి SRH కంప్లైంట్

SRH vs BCCI: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ వివాదాస్పదంగా ముగిసింది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టు 157 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించినప్పటికీ, చివరి బంతికి ముందు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జయదేవ్ ఉనద్కత్ వేసిన బంతిని పంత్ బౌండరీకి తరలించగానే మ్యాచ్ ముగిసింది. ఆ బంతి బౌండరీ లైన్‌ను తాకక ముందే డగౌట్ దగ్గర ఉన్న LSG పేసర్ ఆవేశ్ ఖాన్ తన బ్యాట్‌తో ఆ బంతిని వెనక్కి కొట్టాడు. ఆ బంతి అప్పటికి ఇంకా బౌండరీ లైన్‌ను తాకలేదని, కాబట్టి డెడ్ బాల్ (Law 20.1) లేదా అన్‌ఫెయిర్ ప్లే (Law 41) నిబంధనల ప్రకారం హైదరాబాద్‌కు 5 పెనాల్టీ రన్స్ ఇవ్వాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

BCCIకి ఫిర్యాదు చేసే యోచనలో సన్‌రైజర్స్?: 
ఈ సీజన్‌లో తమకు జరిగిన కొన్ని అన్యాయాలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం BCCIకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది. ఆవేశ్ ఖాన్ ఘటనతో పాటు మరికొన్ని వివాదాస్పద నిర్ణయాల పట్ల వారు అసహనంతో ఉన్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్‌పై అనుమానంతో పాటు ఏప్రిల్ 2న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి పట్టిన క్యాచ్ విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అసహనం వ్యక్తం చేసినందుకు అభిషేక్ శర్మకు జరిమానా కూడా పడింది.

సీజన్‌లో సన్‌రైజర్స్ ప్రయాణం: 
ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక విజయాన్ని (కేకేఆర్‌పై) మాత్రమే నమోదు చేసింది. ఆర్సీబీ, లక్నో చేతుల్లో ఓటమిని చవి చూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి పోరులో శనివారం (ఏప్రిల్ 11న) పంజాబ్ కింగ్స్‌ను ఢీకొనబోతోంది. ఈ వివాదాల నేపథ్యంలో పంజాబ్‌పై విజయం సాధించి తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆరెంజ్ ఆర్మీ ప్లాన్ చేస్తుంది.