మలయాళంలో సుహాసిని గ్రాండ్ రీ-ఎంట్రీ.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'అంచామ్ ప్రమాణం'!

మలయాళంలో సుహాసిని గ్రాండ్ రీ-ఎంట్రీ.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'అంచామ్ ప్రమాణం'!

దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సీనియర్ నటి సుహాసిని. తన నటనతో మంత్రముగ్ధులను చేస్తున్న ఈ నటి ఇప్పుడు మళ్లీ మలయాళ చిత్ర పరిశ్రమలో  అడుగుపెడుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఒక ప్రధాన పాత్రలో  'అంచామ్ ప్రమాణం' (Anchaam Pramaanam) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కథా నేపథ్యం

ఈ చిత్రం 1980ల కాలం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక సైకలాజికల్ థ్రిల్లర్. కేరళలోని ఒక సంపన్న సిరియన్ క్రైస్తవ కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముఖ్యంగా పితృస్వామ్య వ్యవస్థలో మహిళల అణిచివేత, కుటుంబ విలువలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలను ఎలా అణగదొక్కుతారనే అంశాలపై ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సుహాసిని 'గ్రేసీ' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

తారాగణం.. 

ప్రముఖ రచయిత్రి షైనీ ఆంటోనీ అందించిన కథతో, దర్శకుడు జైదేవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జైదేవ్ గతంలో భావన ప్రధాన పాత్రలో వచ్చిన హారర్ థ్రిల్లర్ 'ది డోర్' (2025)తో మెప్పించారు.  రూబీ ఎండీవర్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ మూవీలో కని కుసృతి, షెబిన్ బెన్సన్, వినయ్ మీనన్ వంటి  నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ ఎడిటర్ బీనా పాల్ నిర్వహిస్తుండగా, సూరజ్ ఎస్ కురుప్ సంగీతం అందిస్తున్నారు.

 థ్రిల్లర్ జానర్‌లో 

తమిళం, తెలుగు, మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాసిని, చివరగా 2025లో వచ్చిన 'మధురం జీవామృత బిందు' అనే ఆంథాలజీ చిత్రంలో కనిపించారు.  లేటెస్ట్ గా 'అంచామ్ ప్రమాణం' షూటింగ్ త్రిస్సూర్ జిల్లాలోని కొడంగళూరులో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర చిత్రీకరణ కొడంగళూరుతో పాటు తొడుపుజలోని అందమైన లొకేషన్లలో జరగనుంది.

సుహాసిని మణిరత్నం తన కెరీర్‌లో ఎన్నో క్లాసిక్ సినిమాల్లో భాగమయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒక బలమైన మహిళా ప్రధాన కథతో, అదీ పీరియడ్ థ్రిల్లర్ జానర్‌లో ఆమె రాబోతుండటంతో అటు మలయాళ ఇండస్ట్రీలోనూ, ఇటు ఆమె అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పాత తరం నటనకు, కొత్త తరం మేకింగ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.