తమిళనాడులో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ మేడం.. హీరో విజయ్ కంటే ఎక్కువ ఆస్తులున్నయ్ !

తమిళనాడులో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ మేడం.. హీరో విజయ్ కంటే ఎక్కువ ఆస్తులున్నయ్ !

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న లీమా రోజ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో లీమా రోజ్ అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. లాల్‌గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి లీమా రోజ్ రూ.5 వేల 863 కోట్లతో టాప్-1 రిచ్చెస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలిచారు.

మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన లీమా రోజ్ తన అఫిడవిట్లో ఆమె వ్యక్తిగత, కుటుంబ ఆస్తిపాస్తులను పొందుపరిచారు. ఆమె ప్రకటించిన మొత్తం ఆస్తిలో ఆమె భర్త.. తమిళనాడులో 'లాటరీ కింగ్'గా పాపులర్ అయిన.. ప్రముఖ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్దే మేజర్ షేర్. లీమా తన నామినేషన్ అఫిడవిట్‌లో తమ కుటుంబ మొత్తం ఆస్తి విలువ రూ. 5 వేల 863 కోట్లుగా ప్రకటించారు. ఆమె తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్‌గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. లీమా రోజ్ తన పేరు మీద రూ. 139 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 910 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆమె తన భర్త పేరు మీద రూ. 3,262 కోట్ల విలువైన చరాస్తులను, రూ. 887 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆమె కొడుకు జోస్ టైసన్ మార్టిన్ పేరు మీద కూడా భారీగానే ఆస్తులున్నాయి. జోస్ టైసన్ మార్టిన్ పేరు మీద.. రూ. 225 కోట్ల చరాస్తులు, రూ. 439 కోట్ల స్థిరాస్తులున్నాయి. 

లీమా రోజ్ చేతిలో ఉన్న నగదు రూ. 5 లక్షలు, ఆమె భర్త వద్ద రూ. 56 లక్షలుగా అఫిడవిట్ లో ప్రస్తావించారు. లీమా రోజ్ తన దగ్గర 19 కేజీల 233 గ్రాముల బంగారం, 131 కిలోల వెండి, 12 వందల 17 క్యారెట్ల వజ్రాలు, 32 గ్రాముల ప్లాటినం ఉన్నట్లు తెలిపారు. ఇక కేసుల విషయానికొస్తే.. తనపై ప్రస్తుతం నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని లీమా రోజ్ అఫిడవిట్లో స్పష్టం చేశారు.

సినీ నటుడు, టీవీకే విజయ్ కంటే లీమా రోజ్ కుటుంబ ఆస్తిపాస్తులే ఎక్కువ. నామినేషన్ అఫిడవిట్‎లో తనకు మొత్తం రూ.615 కోట్ల ఆస్తులు ఉన్నట్లు విజయ్ ప్రకటించారు. ఇందులో రూ.405 కోట్ల చరాస్తులు, రూ. 210 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.