IPL 2026: ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు గౌహతిలో భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం వేళ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది. సాయంత్రం 6 గంటల సమయంలో 26 శాతం వర్షం కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య 50 శాతానికి వర్షం పడనుంది.
టాస్ ఆలస్యం:
భారీగా వర్షం కురుస్తుండటంతో ఆలస్యంగా టాస్ పడటంతో పాటు మ్యాచ్ కూడా లేట్ గా ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక రాత్రి 9 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. రాత్రి అవుతున్న కొద్దీ ఆకాశం క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దాదాపు 26°C డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు గాలిలో తేమ (Humidity) ఎక్కువగా ఉంటుంది.
పిచ్ రిపోర్ట్:
గౌహతిలోని బర్సపరా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైనప్పటికీ, ప్రస్తుత వాతావరణం వల్ల బౌలర్లకు వరంగా మారనుంది. వర్షం కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడం వల్ల, ప్రారంభంలో తేమ ఉంటుంది. దీని వల్ల పవర్ ప్లేలో కొత్త బంతితో జోఫ్రా ఆర్చర్ (RR), జస్ప్రీత్ బుమ్రా (MI) లాంటి పేసర్లు బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉంది. పిచ్ సెటిల్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. ఒకవేళ వర్షం ఆగి మ్యాచ్ జరిగితే, రెండో ఇన్నింగ్స్‌లో మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఛేజింగ్ చేసే జట్టుకు బాగా కలిసి వస్తుంది.
మరోవైపు, గాయం నుంచి కోలుకున్న ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి రావడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. వర్షం ముప్పు, మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. కాగా ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన రాజస్థాన్, ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండగా, ముంబై మాత్రం ఈ మ్యాచులో గెలవాలనే పట్టుదలతో వస్తుంది.
