పదేండ్లలో సింగరేణి కార్మికులు గుర్తుకు రాలేదా?: కేటీఆర్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్

పదేండ్లలో  సింగరేణి కార్మికులు గుర్తుకు రాలేదా?:  కేటీఆర్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
  •     పది మంది ఎంపీలున్నా.. పార్లమెంటులో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 
  •     కేటీఆర్‌‌‌‌పై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫైర్‌‌‌‌

కోల్‌‌బెల్ట్, వెలుగు: తెలంగాణ యువత, సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించేలా బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న చిల్లర రాజకీయాలు మానుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హెచ్చరించారు. ‘‘గత పదేండ్లు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నది మీరు కాదా? చీఫ్ మినిస్టర్ మీ సొంత నాయన కాదా? అప్పుడు సింగరేణి కార్మికుల కష్టాలను ఎందుకు పట్టించుకోలేదు”అని గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు. గతంలో పది మంది ఎంపీలున్న బీఆర్ఎస్ ఏనాడు సింగరేణి గురించిగానీ, కార్మికుల సమస్యల గురించి గానీ పార్లమెంటులో ప్రస్తావించలేదని, బీజేపీ వెనుక తోక ముడుచుకొని నడిచారని మండిపడ్డారు. పదేండ్లు సింగరేణి కార్మికుల కష్టాలు కనిపించలేదా ప్రశ్నించారు. కేటీఆర్ మతిలేకుండా గాలి మాటలు మాట్లాడుతూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, ఆయన తన తీరును మార్చుకోవాలని సూచించారు. ఖబర్దార్ కేటీఆర్.. మీ చిల్లర చేష్టల వల్ల సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజలకు హాని జరిగితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

నేషనల్​హైవే విస్తరణకు కేబినెట్​ఆమోదంపై ఎంపీ హర్షం

నేషనల్ హైవే63లోని ఆర్మూర్, జగిత్యాల,- మంచిర్యాల రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడంతో మంచిర్యాల ప్రాంతం రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల మధ్య మరింత మెరుగైన కనెక్టివిటీ సాధ్యమవుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే చాన్స్ ఉందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రహదారి విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందన్నారు. ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు తీసుకొచ్చేందుకు కృషి కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.