- రాహుల్ ప్రసంగానికి అధికార పక్షం వణికిపోయింది
- ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను ఇంటికెళ్లి అరెస్ట్ చేస్తున్నరు
- యాంటీ పేపర్ లీక్ బిల్లులో ఫైన్లు తప్ప కొత్తగా ఏమీ లేదన్న ఎంపీ
న్యూఢిల్లీ, వెలుగు: నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై పార్లమెంట్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానం లేదని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఆయన మాట్లా డుతున్నప్పుడు వణికిపోయిన అధికార పక్షం.. ప్రతి మాటకు అడ్డుతగిలిందని విమర్శించారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు హోంమంత్రి అమిత్ షా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారన్న రాహుల్ వ్యాఖ్యలను ఎలా తప్పుబడతారని కేంద్రాన్ని ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంట్ ఆవ రణలో ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు.
‘‘శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, ఏకే 47 గన్ ఎక్కుపెట్టాలని ఆదేశాలు ఎవరిచ్చారని రాహుల్ ప్రశ్నించారు. విద్యార్థులను టెర్రరిస్ట్‌లుగా ట్రీట్చేస్తూ.. అమిత్ షా ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ ప్రశ్నలు అడుగుతుంటే సభలో రాహుల్ మైక్ కట్ చేశారు. ఆయన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు, సభ్యులు సభలో వణికిపోయారు. రాహుల్‌ను మాట్లాడకుండా అడ్డుతగిలారు” అని తెలిపారు.
నీట్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను ఫేస్ రికగ్నేషన్ కెమెరాలతో గుర్తించి, వారి ఇంటికెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, ఇదేనా ప్రజాస్వామ్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే అని ప్రశ్నించారు. పేపర్ లీకేజ్‌లు కంట్రోల్ చేసేందుకు తెచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లులో కొత్తగా ఏమీ లేద ని, పేపర్ లీక్ చేస్తే విధించే ఫైన్‌ను మాత్రమే పెంచా రన్నారు.
అసలు పేపర్ లీకేజ్ ఎలా జరిగింది? ఆ కుట్రకు బీజం ఎక్కడ పడిందనే దానిపై కనీసం ఎంక్వైరీ చేయలేదన్నారు. ఈ మొత్తం కుట్రలో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని, నీట్ పేపర్ చైర్మన్‌కు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని, అందుకే ఆయనను సస్పెండ్ చేయలేదని వంశీకృష్ణ ఆరోపించారు.
