కిరాణాల్లో రిలయన్స్‌‌ బ్రాండ్లు

కిరాణాల్లో రిలయన్స్‌‌ బ్రాండ్లు

న్యూఢిల్లీఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌‌ అంబానీ గ్రూప్‌‌కు చెందిన రిలయన్స్‌‌ రిటైల్‌‌ తన దుకాణాల్లో అమ్మే ప్రైవేటు లేబుల్స్‌‌ (సొంత బ్రాండ్లు) సరుకులను ఇక నుంచి సాధారణ కిరాణా దుకాణాల్లోనూ  అమ్ముతారు. ప్రస్తుతం ఇవి రిలయన్స్‌‌ స్మార్ట్‌‌, రిలయన్స్‌‌ మార్కెట్‌‌ స్టోర్స్‌‌, రిలయన్స్‌‌ ఫ్రెష్‌‌ స్టోర్లలోనే మాత్రమే లభిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ‘ఆన్‌‌లైన్ టు ఆఫ్‌‌లైన్‌‌’ ఈ–కామర్స్‌‌ ప్లాట్‌‌ఫారమ్‌‌ను ఏర్పాటు చేయాలన్న రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ ప్లాన్‌‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సొంతబ్రాండ్ల అమ్మకానికి రిలయన్స్‌‌ త్వరలోనే డిస్ట్రిబ్యూటర్లను నియమించనుంది. వీటిలో బెస్ట్‌‌ ఫార్మ్స్‌‌, గుడ్‌‌లైఫ్‌‌, మస్తీ ఓయ్‌‌, కేఫీ, ఎంజో, మోప్జ్‌‌, ఎక్స్‌‌పెల్జ్‌‌, హోమ్‌‌వన్‌‌ వంటి సొంత బ్రాండ్లు ఉన్నాయి.  ఎఫ్‌‌ఎంసీజీ, పర్సనల్‌‌ కేర్‌‌ వస్తువుల అమ్మకానికి ఈ బ్రాండ్లను తీసుకొచ్చారు. పెట్రోకెమికల్‌‌, రిఫైనింగ్‌‌ బిజినెస్‌‌లో బలహీనపడ్డందున, ఆ నష్టాన్ని రిటైల్‌‌రంగం ద్వారా పూడ్చుకోవాలన్నది రిలయన్స్‌‌ ప్లాన్‌‌. మనదేశ రిటైల్‌‌రంగం విలువ 700 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో మెజారిటీ వాటా అసంఘటిత రంగానిదే. అత్యధికులు వీధిలోని కిరాణాషాపుల్లోనే కొంటుంటారు.

పెరిగిన రిటైల్‌‌ విభాగం లాభం

రిలయన్స్‌‌ గ్రూపు ఈ నెల 19న తొలి క్వార్టర్‌‌ ఫలితాలను ప్రకటించింది. రిలయన్స్‌‌ రిటైల్‌‌ పన్నుకు ముందు లాభం ఏడాది క్రితంతో పోలిస్తే 70 శాతం పెరిగి రూ.2,049 కోట్లకు చేరింది. ఆదాయం 47.5 శాతం పెరిగి రూ.38,196 కోట్లకు చేరింది. రిలయన్స్‌‌ రిటైల్‌‌కు దేశవ్యాప్తంగా 10,664 స్టోర్లు ఉన్నాయి. జూన్‌‌ క్వార్టర్‌‌లో తమ స్టోర్లను 15 కోట్ల మందికిపైగా సందర్శించారని ప్రకటించింది. ఇండియాలో అత్యధికులు ఇష్టపడే రిటైల్‌‌ స్టోర్‌‌ తమదేనని రిలయన్స్ చెబుతోంది. ఆన్‌‌లైన్‌‌ సెల్లర్లకు కూడా ఎఫ్‌‌ఎంసీజీ డీలర్ల ద్వారా సరుకులు అందజేస్తామని ప్రకటించింది. ఈ కొత్త వ్యాపారం గురించి వచ్చే నెల జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్‌‌ ఎనర్జీ, రిఫైనింగ్ వ్యాపారం ఎంత సంపాదిస్తుందో..2025 నాటికి రిటైల్‌‌ సెగ్మెంట్‌‌ ఆదాయం కూడా అంతకు చేరేలా చేయాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. అందుకే అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌, హిందుస్థాన్‌‌ యూనిలీవర్‌‌, ఐటీసీ వంటి కంపెనీలతో చర్చలు జరుపుతోంది.

ప్రైవేటు లేబుల్స్‌‌ అమ్మకాల కోసం రిలయన్స్‌‌ ప్రత్యేక మొబైల్‌‌ యాప్‌‌ను కూడా ప్రారంభించింది. కొంతమందికి దీనిని అందుబాటులోకి తెచ్చి ప్రయోగాత్మకంగా పరిశీలించింది. వీరిలో అత్యధికులు రిలయన్స్‌‌ ఉద్యోగులే! కిరాణ దుకాణదారులకు కొనుగోలుదారులు సులువుగా డబ్బు చెల్లించేందుకు జియో మొబైల్ పాయింట్‌‌ ఆఫ్‌‌ సేల్స్‌‌ (ఎంపీఓఎస్‌‌) పరికరాలనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి జియో 4జీ నెట్‌‌వర్క్‌‌కు కనెక్ట్‌‌ అయి ఉంటాయి. స్థానికులు ఈ పరికరం ద్వారా కిరాణ దుకాణదారులకు ఆన్‌‌లైన్‌‌లో ఆర్డర్లు ఇవ్వొచ్చు. ఇది వరకే స్నాప్‌‌ బిజ్‌‌, నుక్కడ్‌‌ షాప్స్‌‌, గోఫ్రూగల్‌‌ వంటి కంపెనీలు ఎంపీఓఎస్‌‌ పరికరాలను కిరాణా దుకాణాలకు ఇచ్చాయి. జియో స్టోర్ల నుంచి ఈ–కామర్స్ సేవలు పొందే సదుపాయాన్ని కూడా కల్పించినట్టు రిలయన్స్‌‌ ఇటీవల వెల్లడించింది. ఈ విధానంలో జియో స్టోర్‌‌ సిబ్బంది ఆర్డర్లను తీసుకుంటారు. కస్టమర్లకు స్టోర్‌‌కు వచ్చి తమ ఆర్డర్లను ఇంటికి తీసుకెళ్లొచ్చు. రిలయన్స్‌‌ గ్రూప్‌‌ ఆన్‌‌లైన్ రిటైలింగ్‌‌లో అడుగుపెడితే దేశవ్యాప్తంగా 2023 నాటికి 50 లక్షల కిరాణా స్టోర్లు ఆన్‌‌లైన్‌‌ వ్యాపారంలోకి వస్తాయని బ్యాంక్‌‌ ఆఫ్‌‌ అమెరికా మెరిల్‌‌ లించ్‌‌ ప్రకటించింది.