నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్న సినీ కవికి.. అగ్గితో కడిగినా మారదు లోకం మారదు ఈ లోకం అన్న తీరును.. నడి రోడ్డుపై రాజకీయ నాయకులను... పోలీసులను ఓ మహిళ నిగ్గదీసి ప్రశ్నించిన తీరు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా జే జేలు అందుకుంటుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సిటీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మనిషిలో సహనం నశిస్తే.. జనం బాధలు పట్టకుండా రోడ్లపై ఎప్పుడు పడితే అప్పుడు ధర్నాలు, నిరసనలతో ఇబ్బంది పెట్టే ప్రజాప్రతినిధులను కడిగేసిన తీరు.. అడ్డుకున్న పోలీసులను నిగ్గదీసి కడిగేసిన ఆ మహిళ గట్స్ కు సోషల్ మీడియా హ్యాట్సాఫ్ చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబై నడిబొడ్డున రాజకీయ ర్యాలీలు సృష్టించిన ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న ఒక సామాన్య మహిళ.. ఏకంగా రాష్ట్ర మంత్రిని, పోలీసులను నిలదీసిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్‌ను ఆమె సూటిగా ప్రశ్నించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యుల ప్రాణాలను, సమయాన్ని బలిపెడతారా? అంటూ ఆమె చేసిన గర్జన నెటిజన్ల మనసు గెలుచుకుంది.
వర్లీ ప్రాంతంలోని జంబోరి మైదానం వద్ద బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శన వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో తన బిడ్డను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్న ఒక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఓపిక నశించిన ఆమె, కారు దిగి నేరుగా నిరసనకారుల మధ్యలోకి వెళ్లింది ఆగ్రహంగా. అక్కడ ఉన్న మంత్రి గిరీష్ మహాజన్‌ను ఉద్దేశించి.. వందలాది మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు.. పక్కనే ఖాళీ గ్రౌండ్ ఉన్నప్పుడు రోడ్ల మీద ఈ రచ్చ ఏంటి? అంటూ నిప్పులు చెరిగింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై మహిళలతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీపై.. ఒక మహిళే తమను నిలదీయడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసులు అవాక్కయ్యారు. మధ్యలో వచ్చిన పోలీసులను కూడా ఆమె వదిలిపెట్టలేదు. మీ డ్యూటీ మీరు చేయండి, సీనియర్ అధికారులను పిలవండి అంటూ గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. వెంటనే ఇక్కడి నుంచి అందరూ ఖాళీ చేయండి(Get out of here) అంటూ ఆమె చేసిన హెచ్చరికలకు మంత్రి కూడా మారు మాట్లాడలేకపోయారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒక సామాన్య పౌరురాలు ఇలాగే ప్రశ్నించాలి.. రాజకీయ పార్టీలకు ప్రజల కష్టాల కంటే ప్రచారమే ముఖ్యం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఆమె వీడియోపై. వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా ఆ మహిళ చూపించిన ధైర్యం.. ఇప్పుడు నెట్టింట ఒక క్రేజీ ఉద్యమంలా మారుతోంది. సామాన్యుల గొంతుకగా నిలిచిన ఆమెను చాలా మంది రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.

