వాటర్​సప్లయ్​లో ఇబ్బందులు ఉండొద్దు

వాటర్​సప్లయ్​లో ఇబ్బందులు ఉండొద్దు
  •     మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిదాన కిశోర్​

 హైదరాబాద్, వెలుగు :  నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ ఆదేశించారు. శుక్రవారం వాటర్​బోర్డు ఆఫీసులో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దానకిశోర్​మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలోనే భూగర్భ జలాలు అడుగంటాయని, వాటర్​బోర్డు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు.  6, 9, 15, 18 డివిజన్లలో ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, మొత్తం బుకింగ్స్ లో 73 శాతం అక్కడి నుంచే వస్తున్నాయని చెప్పారు. గతేడాది ఇదే నెలలో చేసిన సరఫరా కంటే ఈసారి అదనంగా 10 ఎంజీడీలు అదనంగా సరఫరా చేసినట్లు వెల్లడించారు.

ఏప్రిల్ నాటికి మరో 12 ఎంజీడీల జలాలు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇక నుంచి రాత్రి సమయాల్లోనూ ట్యాంకర్ల సరఫరా చేయాలని ఆదేశించారు. నైట్​షిఫ్ట్​కోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ ను తీర్చేందుకు ట్యాంకర్లు, డ్రైవర్ల సంఖ్య పెంచుకోవాలని, అవసరమైతే అదనపు ట్యాంకర్లను వినియోగించుకోవాలని సూచించారు. నైట్ షిప్ట్ కోసం డ్రైవర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సొంత ట్యాంకర్ తెచ్చుకుంటే నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే వాటర్​బోర్డు హెడ్డాఫీసులో శుక్రవారం వరల్డ్​వాటర్​డే నిర్వహించారు. వారం రోజులు నీటి విలువ తెలియజేసేందుకు అవ‌గాహ‌న కార్యక్రమాలు చేప‌డుతున్నామ‌ని ఎండీ తెలిపారు.