హిందూ దేవాలయంలో.. ముస్లిం జంట పెళ్లి

హిందూ దేవాలయంలో.. ముస్లిం జంట పెళ్లి

హిందూ  ముస్లిం అనగానే ఠక్కున నెగెటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి.. ఇప్పుడు జరిగిన ఘటన అందుకు భిన్నంగా.. దేశంలోని హిందూ.. ముస్లింల సోదర భావాన్ని చాటిచెప్పింది. వివరాల్లోకి వెళితే.. సిమ్లా జిల్లా రాంపూర్ గ్రామంలో సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.. ఈ గుడి ప్రాంణంలోనే విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్ పీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు కూడా నడుస్తున్నాయి. గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబంలో వివాహం నిశ్చయమైంది. పేద కుటుంబం కావటంతో పెళ్లి వేడుకకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు.. సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పెళ్లి వేడుక చేయాలని నిర్ణయించారు. 

సనాతన హిందూ ధర్మ అందరినీ కలుపుకుని వెళ్లాలని స్పష్టం చేస్తుందని.. మనుషులంతా ఒక్కటే అని చాటి చెబుతుందని.. అందుకే ముస్లిం జంట పెళ్లిని.. సత్యనారాయణ స్వామి ఆలయంలో.. ముస్లిం మత ఆచారం ప్రకారం నిర్వహించటానికి అనుమతించినట్లు తెలిపారు టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ. హిందూ సంస్థలు ముస్లింలకు వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. కానీ ఇక్కడ ఓ ముస్లిం జంట పెళ్లి గుడిలో జరిగిందని.. మునుషుల మధ్య రాజకీయం ఉండకూడదన్నారు శర్మ.  గుడిలోని ముస్లిం జంట పెళ్లికి రాంపూర్ గ్రామస్తులతోపాటు.. హిందూ పరిషత్ ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. 

ఈ పెళ్లి వధువు తండ్రి మాలిక్ మాట్లాడుతూ.. నా కుటుంబానికి.. నా కుమార్తె వివాహానికి విశ్వహిందూ పరిషత్, ఆలయ ట్రస్ట్, స్థానికులు ఎంతో అండగా నిలిచారు.. దగ్గరుండి పెళ్లిని నడిపించారంటూ అభినందనలు తెలిపారు. హిందూ దేవుడి ఆలయంలో.. ముస్లిం మత ఆచారం ప్రకారం ఓ పెళ్లి జరగటం.. దేశంలోని మనుషులందరూ ఒక్కటే అని చాటిచెప్పిందంటున్నారు స్థానికులు.