
మెల్‌బోర్న్ : గాయం నుంచి కోలుకొని ఇటీవలే బ్రిస్బేన్ ఓపెన్‌లో రీఎంట్రీ ఇచ్చిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నడాల్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. గతేడాది కండరాల నొప్పితో ఇబ్బందిపడ్డ నడాల్ తుంటి ఎముకకు సర్జరీ చేయించుకున్నాడు. ఏడాది గ్యాప్ తర్వాత బ్రిస్బేన్ ఓపెన్‌లో బరిలోకి దిగాడు.
అయితే శుక్రవారం జోర్డాన్ థాంప్సన్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో నొప్పి తిరగబెట్టడంతో మెడికల్ టైమ్ ఔట్ తీసుకున్నాడు. కండరంలో చీలిక వచ్చినట్లు స్కానింగ్‌లో తేలడంతో అతను టోర్నీ నుంచి వైదొలిగాడు.
‘ఈ ఏడాది రీ ఎంట్రీ కోసం చాలా కష్టపడ్డా. కానీ గాయం మళ్లీ మొదలైంది. చికిత్స తర్వాత వీలైనంత త్వరగా రాకెట్ పట్టేందుకు ట్రై చేస్తా. మూడు నెలల్లో అత్యుత్తమ స్థాయికి చేరుకుంటానని ఆశిస్తున్నా’ అని నడాల్ ట్వీట్ చేశాడు. ఈ నెల 14 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలవుతుంది.