జనాభా పెరగడం లేదు

జనాభా పెరగడం లేదు

న్యూఢిల్లీ: దేశంలో పాపులేషన్ గ్రోత్ జీరోకు పడిపోయింది. జనాభా అటు పెరుగుతలేదు.. ఇటు తగ్గుతలేదు. పాపులేషన్​లో హెచ్చుతగ్గులు స్థిరంగా కొనసాగుతున్నయి. సంతానోత్పత్తి రేటు 2.2 నుంచి 2.0కు పడిపోవడం వల్లే ప్రస్తుతం పాపులేషన్ స్టెబిలైజేషన్ దశకు చేరుకున్నదని ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్ హెచ్ఎస్)–5’లో వెల్లడైంది. 2019–21 మధ్య 14 రాష్ట్రాలు, యూటీల్లో నిర్వహించిన ఎన్ఎఫ్ హెచ్ఎస్–5 ఫేజ్ 2 సర్వే ఫలితాలను బుధవారం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ విడుదల చేసింది. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు(టీఎఫ్ఆర్– సంతానోత్పత్తి రేటు)ను అంచనా వేశారు. 2015–16 మధ్య నాలుగో సర్వేలో టీఎఫ్ఆర్ 2.2గా ఉండగా, అది ప్రస్తుతం 2.0కు పడిపోయినట్లు వెల్లడైంది. టీఎఫ్ఆర్ 2.1 కంటే తక్కువకు పడిపోతే.. పాపులేషన్ స్టెబిలైజేషన్ అవుతున్నట్టని సర్వేలో పేర్కొన్నారు. టీఎఫ్ఆర్ 2.1 వద్ద ఉంటే.. దానిని రీప్లేస్ మెంట్ రేట్​గా పిలుస్తారు. దేశంలో ప్రస్తుతం ఒక మహిళ, ఆమె భాగస్వామి చనిపోతే.. వెంటనే మరో జంటతో రీప్లేస్ మెంట్ జరుగుతోందట. దీంతో సంతానోత్పత్తి చేయగల జంటల సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, జనాభా కూడా అటు పెరగకుండా, ఇటు తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయని సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్, యూపీ, రాజస్తాన్, జార్ఖండ్ తప్ప మిగతా రాష్ట్రాలు, యూటీలు రీప్లేస్ మెంట్ లెవల్​ను సాధించాయని వెల్లడైంది. 

రెండు ఫేజ్​లలో 5వ సర్వే.. 
ఐదో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేను 2019–21 మధ్య రెండు ఫేజ్​లలో నిర్వహించారు. ఫస్ట్ ఫేజ్ సర్వేను 22 రాష్ట్రాలు, యూటీల్లో చేయగా, నిరుడు డిసెంబర్​లో ఫలితాలు విడుదలయ్యాయి. సెకండ్ ఫేజ్​లో అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, చత్తీస్ గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్​లో సర్వే చేశారు.   

జనాభా కంట్రోల్ లో ఇది గెలుపే
పాపులేషన్ గ్రోత్ సున్నాకు పడిపోవడం అనేది ఓవరాల్ గా జనాభా నియంత్రణలో సాధించిన విజయానికి సూచన అని నిపుణులు చెప్తున్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం 1952 నుంచి అమలు చేస్తున్న ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాం, 2016లో ప్రారంభించిన మిషన్ పరివార్ వికాస్ ప్రోగ్రాం కింద కాంట్రసెప్టివ్స్, ఫ్యామిలీ ప్లానింగ్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తేవడం వంటి చర్యలతోనే పాపులేషన్ గ్రోత్ తగ్గుముఖం పట్టింది” అని పేర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి సూచించిన సస్టయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ ను సాధించే దిశగా దేశం అడుగులు వేస్తోందని ఈ సర్వేతో వెల్లడైందని నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) డాక్టర్ వీకే పాల్ అన్నారు. 

సర్వేలో ఏం తేలిందంటే.. 

  •     దేశంలో గర్భనిరోధక పద్ధతులు వాడుతున్న వాళ్ల సంఖ్య 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. 
  •     సంతానం ఇప్పుడే వద్దనుకున్నప్పటికీ.. కాంట్రసెప్టివ్స్ పద్ధతులు వాడని వాళ్ల సంఖ్య 13% నుంచి 9%కి తగ్గింది.  
  •     మహిళలు, పిల్లల్లో సగం మంది రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్నారు. 
  •     ఆరు నెలల్లోపు పిల్లలకు పాలు ఇస్తున్న తల్లుల సంఖ్య పెరిగింది. ఇది 2015–16లో 55 శాతం ఉండగా, ఇప్పుడు 64 శాతానికి పెరిగింది. 
  •     ఆస్పత్రుల్లో డెలివరీలు 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగాయి. ఇవి పుదుచ్చేరి, తమిళనాడులో 100%  నమోదయ్యాయి. సిజేరియన్ డెలివరీలు కూడా పెరిగాయి. 
  •     12 నుంచి 23 నెలల వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్ 62% నుంచి 76% పెరిగింది. అత్యధికంగా ఒడిశాలో 90 శాతం ఉంది.  
  •     బ్యాంక్ అకౌంట్లున్న  మహిళల సంఖ్య 53% నుంచి 79 శాతానికి పెరిగింది.