నక్సల్స్ దొంగ దాడులు!

నక్సల్స్ దొంగ దాడులు!
  • సెక్యూరిటీ సిబ్బంది టార్గెట్ గా ఐఈడీలతో దాడులు
  • లేటెస్ట్ డేటా వెల్లడి

న్యూఢిల్లీ: నక్సల్స్ నేరుగా పోరాడట్లేదని, సెక్యూరిటీ సిబ్బంది టార్గెట్ గా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)లతోనే ఎక్కువగా దాడులు చేస్తున్నారని లేటెస్ట్ డేటా చెబుతోంది. మూడేళ్లలో ఐఈడీ పేలుళ్ల ఘటనల్లో 260 మంది సెక్యూరిటీ సిబ్బంది  చనిపోయారని లేదా గాయపడ్డారని అధికారులు చెప్పారు. కూంబింగ్ లో పెద్ద ఎత్తున ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు  చెప్పారు. 2017 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు వివిధ రాష్ట్రాల్లోని నక్సల్స్  ప్రభావిత ప్రాంతాల్లో ఐఈడీల పేలుళ్లలో 73 మంది సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారని, 179  మందికిపైగా గాయపడ్డారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చత్తీస్ గఢ్ లోనే ఎక్కువగా సెక్యూరిటీ సిబ్బంది చనిపోయినట్లు తెలిపింది. ఐఈడీ పేలుడు ఘటనల్లో 2017లో ఆరుగురు, 2018లో ఎనిమిది మంది, ఈ ఏడాది ఆగస్టు వరకు ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఐఈడీలపై అవగాహన కల్పిస్తున్నాం: సీఆర్పీఎఫ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని సీఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు. డాగ్ స్క్వాడ్, డిటెక్టర్లు, ఇతర పరికరాలు వినియోగిస్తున్నట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), స్టేట్ పోలీసు ఫోర్సెస్ కు వీటిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీని కోసం పుణెలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఐఈడీ మేనేజ్ మెంట్ సాయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

నక్సల్స్ పోరాట బలం తగ్గింది

నక్సల్స్ సెక్యూరిటీ బలగాలతో నేరుగా పోరాడటం లేదు.  వారి పోరాట బలం తగ్గింది. ఆయుధాలు, పేలుడు సామగ్రి కూడా తగ్గాయి. సీఆర్పీఎఫ్, ఇతర బలగాల కూంబింగ్ తో వాళ్లకు తీవ్ర నష్టం జరిగింది. ఐఈడీల ద్వారా సెక్యూరిటీ ఫోర్సెస్ పై దాడులు చేస్తున్నారు.

– సీఆర్పీఎఫ్ డీఐజీ మోసెస్ దినకరన్