విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై స్పష్టత

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై స్పష్టత

ఉప రాష్ట్రపతి ప్రతిపక్షాల అభ్యర్థిని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ప్రకటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్‌ మార్గరెట్‌ ఆల్వాను పోటీలో నిలిపినట్టు పవార్‌ తెలిపారు. మార్గరెట్‌ ఆల్వా.. గోవా, రాజస్థాన్‌, గుజరాత్‌ గవర్నర్‌గానూ పని చేశారు. ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ను బరిలో నిలిపిన విషయం తెలిసిందే.

మార్గరెట్‌ ఆల్వా స్వస్థలం కర్నాటక. 1942 ఏప్రిల్ 14న మంగళూరులో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా 1978 , 1980 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

 

ఏప్రిల్ 1974లో మార్గరెట్‌ ఆల్వా కాంగ్రెస్ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992లో తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఉన్న సమయంలో పలు స్టాండింగ్‌ కమిటీల్లో సేవలందించారు. 1984-85 మధ్య పలుశాఖలకు కేంద్ర మంత్రిగాను సేవలందించారు. 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.