- టెస్టుల పారామీటర్లు మారిపోతాయన్న నిపుణులు
- మళ్లీ టెస్టులు చేశాకే ఫుల్ రిపోర్ట్ ఇస్తామని వెల్లడి
- ఎనర్జీ డిసిపేషన్పై జూనియర్ అధికారితో స్టడీ
- అన్నారం, సుందిళ్లలో 5 టీఎంసీల వరకు నింపుకోవచ్చన్న అభిప్రాయాలు
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి గ్రౌటింగ్ చేయడమే సమస్యగా మారిందా? దానిపైనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) అభ్యంతరాలు చెబుతున్నదా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. సిఫార్సులు చేసిన టెస్టులు చేయకుండానే గ్రౌటింగ్ ఎందుకు చేశారంటూ ఇటీవల ఎన్డీఎస్ఏ నిపుణులు ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. దాని వల్ల చేయాల్సిన టెస్టుల పారామీటర్స్ అన్ని మారిపోతాయని, మళ్లీ టెస్టులు చేయాలని సూచించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
మళ్లీ 20 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్ తవ్వి సిఫార్సు చేసిన జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టులను నిర్వహించాలని చెప్పినట్టు సమాచారం. వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత.. గేట్లన్నింటినీ తెరిచి పెట్టాల్సిందేనని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పింది. అయితే ఏడో బ్లాక్‌లోని కుంగిన పిల్లర్ల కింద భారీ బుంగ పడినట్టు ఈ ఏడాది మేలో అధికారులు గుర్తించారు. దీంతో ఆ రంధ్రాన్ని పూడ్చేందుకు అధికారులు కాంక్రీట్ మిక్చర్‌తో గ్రౌటింగ్ చేశారు. దీనిపైనే ఎన్డీఎస్ఏ అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్తున్నారు.
కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా చేస్తారని ప్రశ్నించిందని చెబుతున్నారు. కానీ గ్రౌటింగ్ చేయడం వల్లే బ్యారేజీ గేట్లను ఎత్తగలిగామని, లేకపోతే మరింత నష్టం జరిగేదని అధికారులు అంటున్నారు. అయితే, మళ్లీ టెస్టులు చేసి ఆ రిపోర్టులు వచ్చాకే పూర్తి స్థాయి నివేదికను ఇస్తామని ఎన్డీఎస్ఏ నిపుణులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ టెస్టులు పూర్తయి రిపోర్టులు వచ్చే వరకు ఎంత టైం పడుతుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ ఆఖరు నాటికైనా పూర్తి స్థాయి రిపోర్టు వస్తుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి.
ఎనర్జీ డిసిపేషన్పై స్టడీ
మేడిగడ్డ వద్ద ఎనర్జీ డిసిపేషన్(గేట్లను ఎత్తినప్పుడు వరద వేగానికి గేట్లకు దిగువన పడే వరద శక్తి/పీడనం)ను తగ్గించేందుకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు అధికార వర్గాలు సిద్ధమవుతున్నాయి. అందుకు ఎనర్జీ డిసిపేషన్ మీద స్పెషలిస్ట్ అయిన ఓ జూనియర్ స్థాయి అధికారికి స్టడీ చేయించే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.
ఆ అధికారిని ఐఐటీ రూర్కీకి పంపి ఎనర్జీ డిసిపేషన్పై స్టడీ చేయిస్తున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఎనర్జీ డిసిపేషన్ ఏర్పాట్లు చేయకపోవడమూ ప్రధాన కారణమని మాజీ ఈఎన్సీ సహా చాలా మంది అధికారులు కాళేశ్వరం జుడీషియల్ కమిషన్ ఎంక్వైరీలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యారేజీకి అవసరమైన ఎనర్జీ డిసిపేషన్ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
అన్నారం, సుందిళ్లలో 5 టీఎంసీలు నింపొచ్చు
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వాడుకోవచ్చని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాటిలో కనీసం 5 టీఎంసీల నీటిని నింపుకునేందుకు అవకాశం ఉందని, ఎలాంటి సమస్యలు రావని అంటున్నారు. ఇదే విషయంపై ఎన్డీఎస్ఏకి పలు సూచనలు చేసినా.. ఎన్డీఎస్ఏ అధికారులు వద్దని తేల్చి చెప్పారు. అయితే, ఇటు ఆయా బ్యారేజీల కాంట్రాక్ట్ సంస్థలు కూడా వాటిలో నీళ్లు నింపుకుంటే ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తున్నట్టు తెలిసింది.
అవసరమైతే గేట్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి బ్యారేజీ మెయింటెనెన్స్‌ను ఎన్డీఎస్ఏ మానిటర్ చేయొచ్చని కూడా అధికారులు చెప్పినట్టు తెలుస్తున్నది. ఎప్పటికప్పుడు బ్యారేజీల పరిస్థితులపై ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్పినా ఎన్డీఎస్ఏ వద్దని కరాఖండిగా చెప్పినట్టు సమాచారం.
