లిఫ్ట్​ స్కీంలకు పెరగనున్న కరెంట్​ బిల్లులు

లిఫ్ట్​ స్కీంలకు పెరగనున్న కరెంట్​ బిల్లులు
  • లిఫ్టుల కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లులకు ఈసారి 4 వేల కోట్లు కావాలి
  • సర్కారుకు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదనలు .. విద్యుత్​ సంస్థలకు ఇప్పటికే 3వేల కోట్ల బాకీ


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లులకు ఈ వాటర్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌(2022–23)లో కనీసం రూ. 4 వేల కోట్లు అవసరమని ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ అధికారులు లెక్క తేల్చారు. రోజుకు గరిష్టంగా 3 వేల మెగావాట్లదాకా  కరెంట్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ వాటర్​ ఇయర్​లో రికార్డుల కోసం కాకుండా అవసరాల మేరకు మాత్రమే పంపులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు మాత్రమే ఎత్తిపోతల పథకాలను ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ చేయాలని, అవసరం లేనప్పుడు మోటార్లు నడిపేది లేదని ఇంజనీర్లు చెప్తున్నారు. గత రెండేండ్ల మాదిరిగానే ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిస్తే కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లులకు రూ. వెయ్యి కోట్ల వరకు అవసరమవుతాయని, వర్షాలు తక్కువగా కురిస్తే పూర్తి సామర్థ్యం మేరకు మోటార్లు నడపాల్సి ఉంటుందని అంటున్నారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థలకు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంల బిల్లులు రూ. 3 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేకపోతే కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లు తడిసి మోపెడయ్యే అవకాశం ఉంది. 

లిఫ్ట్​ స్కీంలకు పెరగనున్న కరెంట్​ బిల్లులు

ఏటా కరెంట్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీల రూపంలో విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థలకు రూ.10,500 కోట్లు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ స్కీంల కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల బిల్లులే రూ. 2 వేల కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. దేవాదుల, కల్వకుర్తి సహా ఇతర ఎత్తిపోతల బిల్లులు ఇంకో రూ. వెయ్యి కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లులపై ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ కో అధికారులు పలుమార్లు కోరినా నిధులు విడుదల చేయడం లేదు. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంలకు ఇచ్చే కరెంట్‌‌‌‌‌‌‌‌కు నిరుటి వరకు యూనిట్‌‌‌‌‌‌‌‌కు రూ. 5.08 ఉండగా, ఈ ఏడాది నుంచి రూ. 6.10కు పెంచుతూ విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ ఏడాది లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంలకు కరెంట్‌‌‌‌‌‌‌‌ వినియోగం తగ్గినా బిల్లులు పెరిగే అవకాశముంది. మోటార్లు నడిపిన రోజులకు కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లులు, మిగతా రోజులకు కనీస చార్జీలు చెల్లించాలి. ఇలా చెల్లించే కనీస చార్జీని కూడా పెంచబోతున్నట్టు తెలిసింది. దీంతో ఈసారి ఎత్తిపోతలు మరింత భారం కానున్నాయి. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో వృథాగా పంపులు నడపకుండా ఉండేందుకు రియల్‌‌‌‌‌‌‌‌ టైం అనాలసిస్‌‌‌‌‌‌‌‌ సిస్టం అమల్లోకి తెచ్చారు. దీని ఆధారంగా ఎగువ నుంచి వచ్చే వరదను ముందుగానే అంచనా వేసి ఎక్కడ అవసరమైతే అక్కడే పంపులు నడిపిస్తున్నారు. ఎస్సారెస్పీకి వరద వస్తే మిడ్‌‌‌‌‌‌‌‌ మానేరు తర్వాత లింక్‌‌‌‌‌‌‌‌లోనే మోటార్లు నడిపి కింద ఉన్న మోటార్లను పక్కన పెడతారు. ఒకవేళ ఎగువ నుంచి వరద రాకపోతే మేడిగడ్డ నుంచి ఆ తర్వాత ఎల్లంపలి నుంచి నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపడుతున్నామని ఇంజనీర్లు వివరించారు. దీని ద్వారా కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లుల భారాన్ని తగ్గిస్తామని చెప్తున్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌, ఏఎమ్మార్పీ, దేవాదుల ఎత్తిపోతలను నడిపించాల్సి ఉంటుందని, వాటితోపాటు అవసరం మేరకు ఐడీసీ లిఫ్టులు, ఇతర ఎత్తిపోతలకు రోజుకు కనీసం 800 మెగావాట్ల వరకు కరెంట్‌‌‌‌‌‌‌‌ వినియోగం తప్పనిసరి అని అంటున్నారు.

కాళేశ్వరానికే 2 వేల మెగావాట్లు

ఈ ఏడాది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే గరిష్ట విద్యుత్​ డిమాండ్‌‌‌‌‌‌‌‌ 1800 నుంచి 2 వేల మెగావాట్లదాకా ఉంటుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. దేవాదులకు 300,  గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌లోని ఐడీసీ లిఫ్టులు, ఇతర ఎత్తిపోతలకు కలిపి ఇంకో 100 మెగావాట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ అవసరమని లెక్కగట్టారు. కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ ఎత్తిపోతలకు 500 మెగావాట్లు, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌, ఏఎమ్మార్పీ, తుమ్మిళ్ల, భక్తరామదాసు, ఐడీసీ లిఫ్టులు, ఇతర ఎత్తిపోతలకు 200 మెగావాట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని అంచనా వేశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం మోటార్లు ఆపరేట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి వస్తే ఇంకో 100 మెగావాట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ అవసరం. ఇందుకు గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌లో కాళేశ్వరం పంపులు గరిష్టంగా 2 నెలల పాటు, దేవాదుల పంపులు 5 నెలలు నడపాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లోని ఎత్తిపోతలను 5 నెలలు ఆపరేట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.