టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండా.. బారికేడ్లు లేకుండా దూసుకుపోయే రోజులు వచ్చేస్తున్నాయ్. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్న ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ టోలింగ్ విధానంతో ప్రయాణాలు మరింత స్పీడ్‌గా మారబోతున్నాయి. అయితే ఈ సరికొత్త శాటిలైట్ ఏఐ ఆధారిత వ్యవస్థలో టోల్ మినహాయింపు ఉన్న ప్రభుత్వ, రక్షణ శాఖ, పోలీసు శాఖ వాహనాలకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్రం ఒక క్రేజీ ప్లాన్ చేస్తోంది. ఈ టోల్ ఫ్రీ వాహనాల కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీని తీసుకురావడానికి రవాణా శాఖ సిద్ధమైంది.
ప్రస్తుతం పరిశీలనలో ఉన్న MLFF వ్యవస్థలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద అసలు ఆగాల్సిన అవసరం లేదు. హైస్పీడ్‌తో వెళ్తున్నా సరే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా టోల్ ఫీజు కట్ అయిపోతుంది. అయితే సాధారణ వాహనాలకు ఇది సూపర్ సక్సెస్ అయినా.. టోల్ మినహాయింపు ఉన్న ఆర్మీ, పారామిలట్రీ, పోలీస్, వీవీఐపీ వాహనాల విషయంలో చిన్న సమస్య వచ్చి పడింది. ఈ ఆటోమేటిక్ సిస్టమ్ వల్ల కొన్నిసార్లు డిఫెన్స్ వాహనాలకు కూడా పొరపాటున టోల్ ఛార్జీలు పడటం, ఈ-చలాన్లు జారీ అవ్వడం వంటి సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ తలనొప్పులకు చెక్ పెట్టేందుకే కేంద్ర రవాణా శాఖ సరికొత్త స్పెషల్ ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీని డిజైన్ చేస్తోంది. ఈ స్పెషల్ కాన్ఫిగర్డ్ ఫాస్ట్ ట్యాగ్‌లు ఉన్న వాహనాలు బారికేడ్లు లేని స్మార్ట్ లేన్ల గుండా ఎంత వేగంతో వెళ్లినా పైసా కూడా కట్ అవ్వదు. ఎలాంటి వైలేషన్ నోటీసులు కూడా రావు. రక్షణ రంగానికి చెందిన అధికారిక మిలిట్రీ వాహనాలకైతే అసలు ఫాస్ట్ ట్యాగ్ కూడా అవసరం లేని విధంగా టెక్నాలజీని వాడుతున్నారు. వీటి ప్రత్యేక డిఫెన్స్ నంబర్ ప్లేట్లను సిస్టమ్ గుర్తిస్తుంది. అంతేకాదు దేశ భద్రత దృష్ట్యా ఈ మిలిట్రీ వాహనాల మూవ్‌మెంట్ డేటాను సిస్టమ్ వెంటనే డిలీట్ చేసేలా హై-సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా జోడిస్తున్నారు.
అలాగే అధికారిక విధుల కోసం ఉపయోగించే ప్రైవేట్ వాహనాల కోసం కేంద్రం రెండు ఆప్షన్లను పరిశీలిస్తోంది. మొదటిది.. ఆ వాహనాల వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు ముందే అందించి, అపరిమిత ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్న ప్రత్యేక ఫాస్ట్ ట్యాగ్‌లను కేటాయించడం. ఇక రెండోది.. వాటికి సాధారణ ఫాస్ట్ ట్యాగ్‌లను ఇచ్చి టోల్ కట్ అయిన తర్వాత ఆయా ప్రభుత్వ విభాగాలు ఆ మొత్తాన్ని రీఇంబర్స్ చేసేలా ఏర్పాటు చేయటం. ఇప్పటికే రక్షణ, పోలీస్ డేటాబేస్‌లను టోల్ సిస్టమ్‌తో అనుసంధానించి చేసిన పైలట్ ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. త్వరలోనే ఈ సరికొత్త స్మార్ట్ టోల్ సిస్టమ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
