సైంటిస్టుల లేటెస్ట్ రీసెర్చ్: ఈ కండిష‌న్స్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గే చాన్స్

సైంటిస్టుల లేటెస్ట్ రీసెర్చ్: ఈ కండిష‌న్స్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గే చాన్స్

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి కట్ట‌డికి భార‌త్ స‌హా అన్ని దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. వైర‌స్ వ్యాప్తికి ఉన్న బెస్ట్ మంత్రం.. సోష‌ల్ డిస్టెన్సింగ్. దీన్ని క‌ఠినంగా ఆచ‌రించ‌డం కోసం ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని, స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ ను నియంత్రించవ‌చ్చ‌ని అన్ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే దేశం మొత్తాన్ని 21 రోజుల పాటు లాక్ డౌన్ చేస్తూ భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఎవ‌రూ ఇల్లు దాటి బ‌య‌ట‌కు రావొద్ద‌ని పిలుపునిచ్చారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఇప్ప‌టికే చైనా, ఇట‌లీ, బ్రిట‌న్. అమెరికా సహా ప‌లు దేశాలు లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నాయి. ఓ వైపు నియంత్ర‌ణ చ‌ర్య‌లు సాగుతుండ‌గా.. మ‌రో వైపు ప్ర‌పంచ‌ దేశాల శాస్త్ర‌వేత్త‌లు ఈ వ్యాక్సిన్ క‌నుక్కొనే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అలాగే ఈ కొత్త వైర‌స్ జ‌న్యు క్ర‌మం, ల‌క్ష‌ణాలు, వ్యాపించే తీరు లాంటి అంశాల‌పైనా అధ్య‌య‌నాలు చేస్తున్నారు సైంటిస్టులు.

చిన్న‌పాటి ఊర‌ట‌!

క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ దేశాలు శ్ర‌మిస్తున్న వేళ‌.. శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌ల్లో చిన్న‌పాటి ఊర‌ట‌నిచ్చే ఫ‌లితం ఒక‌టి తేలింది. ఎండ‌లు పెరిగే కొద్దీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని అమెరికాలోని మ‌సాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (MIT) రీసెర్చ‌ర్లు తెలిపారు. జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ సేక‌రించిన డేటా ఆధారంగా MIT ఈ అంచ‌నాకు వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉష్ణోగ్ర‌తలు 3 నుంచి 13 డిగ్రీ సెంటిగ్రేడ్ మ‌ధ్య ఉన్న దేశాల్లో వేగంగా వ్యాపించింద‌ని పైంటిస్టులు గుర్తించారు. అయితే క‌నీసం 18 డిగ్రీల‌పైన టెంప‌రేచ‌ర్ ఉన్న దేశాల్లో గ‌డ్డ‌క‌ట్టే చ‌లి ఉన్న దేశాల‌తో పోలిస్తే 5 శాతం త‌క్కువ క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు వారు తెలిపారు. అమెరికాలోనూ ప్ర‌స్తుతం అత్యంత చ‌లిగా ఉన్న న్యూయార్క్, వాషింగ్ట‌న్ రాష్ట్రాల‌తో పోలిస్తే, ఫ్లోరిడా, టెక్సాస్, అరిజోనా లాంటి చోట్ల ఈ వైర‌స్ వ్యాప్తి త‌క్కువ‌గా ఉంద‌ని వారి ప‌రిశీల‌న‌లో తేలింది. అమెరికాలో మార్చి 19 నుంచి వ‌సంత రుతువు మొద‌ల‌లైంది. దీంతో అక్క‌డ ఎండ‌లు పెరుగుతాయ‌ని, వైర‌స్ వ్యాప్తి కొంత‌మేర కంట్రోల్ లోకి వ‌స్తుంద‌ని MIT శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన సార్స్ (క‌రోనా ఫ్యామిలీ) వైర‌స్ కూడా ఉష్ణోగ్ర‌త పెరిగేకొద్దీ కంట్రోల్ లోకి వ‌చ్చింద‌ని వారు చెబుతున్నారు. స్పెయిన్, ఫిన్లాండ్, చైనాల్లో జ‌రిగిన మ‌రికొన్ని అధ్య‌య‌నాల్లోనూ ఎండలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో వైర‌స్ వ్యాప్తి వేగం త‌క్కువ‌గా ఉంద‌ని తేలింది. అయితే ఈ రీసెర్చ్ లలో ఎక్కువ భాగం కేసుల సంఖ్య‌పై ఆధార‌ప‌డి చేసిన‌వి కాబ‌ట్టి పూర్తిస్థాయిలో కేవలం ఎండ కార‌ణంగానే క‌రోనా వ్యాప్తి త‌గ్గింద‌ని భావించ‌డానికి లేద‌ని, ఆయా ప్రాంతాల్లోని ప్ర‌భుత్వాలు వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. ఎండ తీవ్ర‌త పెరిగితే వైర‌స్ మ‌న‌ల్ని ఏమీ చేయ‌లేద‌న్న భ్ర‌మ‌లో ఉండ‌కుండా సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం ద్వారా క‌రోనాకి అడ్డుక‌ట్ట వేయాల‌ని సూచిస్తున్నారు.

వైర‌స్ ఎలా అంతం ఎలా?

అమెరికాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ ఉట్టా ప‌రిశోధ‌కులు క‌రోనా వైర‌స్ పై లోతుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ వైర‌స్ అంతం ఎటువంటి పరిస్థితుల్లో సాధ్య‌మవుతుందో తేల్చేందుకు రీసెర్చ్ సాగిస్తున్నారు. ఇందుకోసం డాక్ట‌ర్ స‌వీజ్ త‌న టీమ్ తో క‌లిసి క‌రోనా (SARS-CoV-2) వైర‌స్ జ‌న్యు క్ర‌మం (జినోమ్ కోడ్)తో ఒక న‌మూనా షెల్ ను త‌యారు చేశారు. వైర‌స్ కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ప‌ని చేసే దాని పై పొర‌ను నాశ‌నం చేస్తే అది అంత‌మ‌వుతుంద‌ని, ఎలాంటి కండిష‌న్స్ లో ఆ పొర డ్యామేజ్ అవుతుంద‌న్న దానిపై త‌మ అధ్య‌య‌నం సాగుతోంద‌ని చెప్పారు స‌వీజ్. దానిని తీవ్ర‌మైన వేడి, గ‌డ్డ‌గ‌ట్టే చ‌లి, ఏసీ రూమ్స్.. ఇలా ర‌క‌ర‌కాల వాతావ‌ర‌ణాల్లో ఉంచి ప‌రీక్ష‌స్తున్నామ‌న్నారు. అయితే క‌రోనా వైర‌స్ సాధార‌ణ ఫ్లూ వైర‌స్ లాగే తుంప‌ర్లు మీద‌ప‌డిన‌ప్పుడు మ‌రొక‌రికి అంటుకుంటోంద‌ని చెప్పారామె. గాలిలో ఈ వైర‌స్ త‌న రూపాన్ని నిలుపుకోలేక న‌శిస్తోంద‌ని వివ‌రించారు.