న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు నోటీసులు జారీ చేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ స్పందనను కోరింది. లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాతి రోజు రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) లో ప్రొడ్యూస్ చేయగా.. కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. కాగా, ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. స్పెషల్ జడ్జి కావేరి బవేజా కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు.
దీంతో సీబీఐ అరెస్ట్, రిమాండ్ ను.. అలాగే ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను ఇదే కేసులో విచారించేందుకు సీబీఐకి అనుమతినిస్తూ ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని రిట్ పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ ఉత్తర్వులు క్రిమినల్ చట్టాలలోని నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని ప్రస్తావించారు.
కాగా, ఈ పిటిషన్లను గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్జడ్జి బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్బంగా కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కవిత అరెస్ట్, రిమాండ్ అక్రమమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మధ్యలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ జోక్యం చేసుకొని.. ‘మీరు ప్రతివాది (సీబీఐ)కి నోటీసులు ఇవ్వాలని కోరుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. ఇందుకు విక్రమ్ చౌదరి అవునని బదులిచ్చారు. దీంతో కవిత పిటిషన్లపై వారి స్పందన తెలపాలని సీబీఐకి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.
24న రెండు పిటిషన్లపై విచారణ
ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల 24న ఇదే బెంచ్ ముందుకు రానుందని, ఆరోజు ఆ పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని అడ్వకేట్ విక్రమ్ చౌదరి కోరారు. ఇందుకు నిరాకరించిన బెంచ్.. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఈ నెల 24 వ తేదీనే కలిపి విచారిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేశారు.
ఈ కేసులో కవిత మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ట్రయల్ కోర్టు రెండు పిటిషన్లను తిరస్కరించింది. దీంతో ఈ నెల 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం 1,149 పేజీలతో ఈ నెల 9న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 10వ తేదీన ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఈడీకి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 24న మధ్యాహ్నం 12:30లకు వాయిదా వేసింది.
