భారత్ న్యూజిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)పై చర్చలు విజయవంతంగా ముగిశాయి. సోమవారం భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ చారిత్రాత్మక ఒప్పందం గురించి ప్రకటన చేసింది. భారత ప్రధాని మోడీ-న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన టెలిఫోన్ చర్చల తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. విశేషమేమిటంటే.. ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థతో భారత్ ఇంత వేగంగా వాణిజ్య చర్చలు పూర్తి చేయడం ఇదే మొదటిసారి. 2025 మార్చిలో ప్రారంభమైన ఈ చర్చలు కేవలం ఐదు రౌండ్లలోనే ముగిశాయి.
ఒప్పందంలోని కీలక అంశాలు:
1. తాజా ఒప్పందం ప్రకారం భారత్ నుండి న్యూజిలాండ్‌కు వెళ్లే అన్ని ఎగుమతులపై సున్నా శాతం సుంకం (Zero-duty) వర్తిస్తుంది. మరోవైపు భారత్ కూడా రెండు దేశాల మధ్య జరిగే సుమారు 95 శాతం వాణిజ్య రంగానికి సుంకాల మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది.
2. వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.లక్షా 80వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేసింది.
3. ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, టూరిజం, విద్యా రంగాల్లో భారత్‌కు న్యూజిలాండ్ మార్కెట్ అగ్రిమెంట్ కింద ఎంట్రీ కల్పిస్తుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు చదువు తర్వాత అక్కడ పని చేసుకునే అవకాశాలు, వృత్తి నిపుణులకు తాత్కాలిక వర్క్ వీసాల విషయంలో వెసులుబాటు లభిస్తుంది.
ఈ ఒప్పందం కేవలం ఎగుమతి, దిగుమతులకే పరిమితం కాకుండా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంపై కూడా దృష్టి సారించింది. ఆపిల్, కివీ ఫ్రూట్, తేనె వంటి ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే భారత్‌లోని సున్నితమైన కొన్ని వ్యవసాయ రంగాలను ఈ సుంకాల మినహాయింపు నుంచి పక్కన పెట్టి, భారత రైతుల ప్రయోజనాలను మోడీ సర్కార్ కాపాడింది.
తాజా ఒప్పందం కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాదన్నారు కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్. అలాగే వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ దీనిని 'న్యూ జనరేషన్ ట్రేడ్ ప్యాక్'గా అభివర్ణించారు. డీల్ వాణిజ్యంతో పాటు రక్షణ, విద్య, పర్యాటక రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారీ ఊతం కలగనుంది.
