విజయోత్సవ సంబరాల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు తీవ్ర విషాదాన్ని నింపాయి.పూణె సమీపంలోని జెజురీగఢ్ పర్వత ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. జెజురీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జెజురీగఢ్ సంప్రదాయాల ప్రకారం వేడుకల్లో ఒకరిపై ఒకరు బండారి (పసుపు) పూసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తుండగా, పసుపులో కలిసిన రసాయనాల కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో కొత్తగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లతో సహా మొత్తం 16 మందికి చేతులు, కాళ్లకు తీవ్రంగా మంటలంటుకున్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వేడుకల్లో ఉపయోగించిన పసుపులో రసాయనాలు కలిసినందువల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
