కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులను టార్గెట్ చేస్తూ జరిగిన భారీ ఆన్‌లైన్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి టెక్నాలజీని వాడుకుని భక్తుల జేబులకు ఎలా చిల్లు పెట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం..
దైవ దర్శనం కోసం వెళ్లే భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర కేటుగాడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన నిందితుడు కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కుక్కే సుబ్రమణ్య స్వామి, ధర్మస్థల వంటి ప్రాంతాలకు వచ్చే భక్తులను టార్గెట్ చేసుకుని రూమ్స్ బుకింగ్ పేరుతో లక్షలాది రూపాయలు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.
నిందితుడు అత్యంత తెలివిగా గూగుల్ మ్యాప్స్, సెర్చ్ ఇంజన్లలో ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ హోటళ్లు, గెస్ట్ హౌస్‌ల పేర్లను ఉపయోగించి నకిలీ వెబ్‌సైట్లు, ఫోన్ నంబర్లను సృష్టించేవాడు. భక్తులు తమ ప్రయాణానికి ముందు రూమ్స్ బుకింగ్ కోసం గూగుల్‌లో వెతికినప్పుడు, ఒరిజినల్ వెబ్‌సైట్ల కంటే ముందే నిందితుడు రూపొందించిన నకిలీ నంబర్లు కనిపించేవి. ఆ నంబర్లకు భక్తులు ఫోన్ చేయగానే, తక్కువ ధరకే గదులు ఇస్తామని నమ్మబలికేవాడు. ఇలా చాలా మందిని మోసం చేసి డబ్బు కాజేసేవాడు.
భక్తులు రూమ్ బుకింగ్స్ పూర్తవ్వగానే.. అడ్వాన్స్ పేమెంట్ పేరుతో గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపమని కోరేవాడు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు రూమ్ దొరకదేమో అన్న కంగారులో నిందితుడు పంపిన క్యూఆర్ కోడ్లకు నగదు బదిలీ చేసేవారు. ఒకసారి డబ్బు చేతికి అందగానే, నిందితుడు తన ఫోన్ నంబర్లను స్విచ్ఛాఫ్ చేసేవాడు. తీరా భక్తులు ఆలయ పరిసరాలకు చేరుకుని సంబంధిత హోటళ్లను విచారించగా.. అక్కడ తమ పేరిట ఎలాంటి బుకింగ్ లేదని తెలిసి లబోదిబోమనేవారు.
వరుసగా వస్తున్న ఫిర్యాదులతో అప్రమత్తమైన కర్ణాటక పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతం నుండి ఈ మోసాలను సాగిస్తున్నట్లు గుర్తించి, ప్రత్యేక బృందాలను పంపి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బాధితుల నుండి కాజేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇకనైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు హోటల్ రూమ్ బుకింగ్ కోసం కేవలం అధికారిక ఆలయ వెబ్‌సైట్లు లేదా గుర్తింపు పొందిన ట్రావెల్ పోర్టల్స్ మాత్రమే వాడాలని, గూగుల్‌లో కనిపించే గుర్తుతెలియని ఫోన్ నంబర్లకు ముందే డబ్బులు పంపి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం కర్ణాటకలోనే కాకుండా కొన్ని రోజుల కిందట శబరిమలలో కూడా ఇలాంటి మోసాలే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
