సడెన్ గా సేవ్ ఆరావళి ఉద్యమం తెరపైకి వచ్చింది. ఆరావళి పర్వతాలను కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోరాటం చేస్తు్న్నారు నెటిజన్లు. సేవ్ ఆరావళి అంటూ భారీ ఎత్తున గళమెత్తుతున్నారు.
నెటిజన్స్ సేవ్ ఆరావళికి మద్దతు తెలుపుతున్నారు. రాజస్థాన్ లక్షలాది మంది ప్రజలు స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తన వాయిస్ ను గట్టిగా వినిపిస్తోంది. ఆరావళి పర్వాతాల్లో ఏం జరుగుతోంది.. ఎందుకీ ఉద్యమం?..
ఇటీవల ఆరావళి పర్వతాల్లో తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కింది.2025 నవంబర్ 20న కేంద్ర ప్రభుత్వం సిఫార్సు ఆధారంగా సుప్రీంకోర్టు.. ఆరావళి పర్వతాలకు కొత్త నిర్వచనాన్ని అంగీకరించింది. 100 మీటర్ల లోపు ఉన్న వాటిని ఆరావళి పర్వతాలుగా చెప్పలేమని కేంద్రం ఇచ్చిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. దీంతో సుప్రీంకోర్టు తమ సిఫార్సును అంగీకరించింది కాబట్టి.. తాము మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వొచ్చు అని కేంద్రం అంటోంది. అయితే సుప్రీంకోర్టు తన తీర్పులో ఆరావళి పర్వత శ్రేణుల స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని తెలిపింది.
సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో ఆరావళి పర్వతాలను కాపాడే ఉద్యమం మరింత ఉదృతం అయింది. అలాగే రాజస్థాన్ లోని లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు ఆరావళి పర్వతాలను కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోరాటం చేస్తు్న్నారు నెటిజన్లు. సేవ్ ఆరావళి అంటూ భారీ ఎత్తున గళమెత్తుతున్నారు.
ఎందుకీ ఉద్యమం?
దేశంలో పురాతనమైన ఆరావళి పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. ఇవి దేశ చరిత్ర, భౌగోళిక శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఈ పర్వతాలపై ఖనిజాల కోసం తవ్వకాలు జోరుగా సాగుతుండటంతో క్రమంగా కొండలు తరిగిపోతున్నాయి. పర్యావరణం దెబ్బతింటోంది. ఈ పర్వతాలు తరిగిపోతూ ఉంటే చలిగాలులు ముందుగానే ఇండియాలోకి వచ్చే ప్రమాదం ఉంది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో 100 మీటర్ల కంటే (328 అడుగులు) తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరుపుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, పర్యావరణ వేత్తలకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్వతాల్ని కాపాడటం మానేసి, మైనింగ్‌కి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్ , అక్రమ కట్టడాలతో పర్యావరణం తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది.. మైనింగ్ తో వచ్చే ధూళితో ఎడారి రాష్ట్ర రాజస్థాన్ దుర్భర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు పర్యావరణ వేత్తలు.
మరోవైపు దేశవాప్యంగా నెటిజన్స్, విద్యార్థులు తీవ్ర నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. విపక్షాలు సైతం ఆరావళి విధ్వంసాన్ని ఆపాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆరావళి పర్వతాలలో గనుల తవ్వకాల కోసం వాటి నిర్వచనాన్ని మార్చారని వస్తున్న ఆరోపణల పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికి పైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. మొత్తం 1.44 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కేవలం 0.19% పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఆరావళి పర్వతాల మైనింగ్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆరావళి పర్వతాల్లో అరుదైన, గొప్ప ఖనిజాలు ఉన్నాయి. ఇప్పటికే మైనింగ్ చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాదు.. వన్యప్రాణులకు కూడా దిక్కు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇది మరణ శాసనమే అని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కేంద్రాన్ని హెచ్చరించారు. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ విస్తరిస్తే పర్యావరణ నష్టమే కాదు. అక్రమాలూ జరుగుతాయని అంటోంది. ఇది అక్రమ మైనింగ్ మాఫియాకు ఆహ్వానమే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
