
- నేను ఏ ఒక్కరికీ తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదు: ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో మోదీ
- సంపద సృష్టించేవారిని, శ్రమజీవులను సమానంగా గౌరవిస్తా
- నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ‘టాటా బిర్లా సర్కార్’ అన్నరు
- కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చారన్న ప్రధాని
న్యూఢిల్లీ : దేశంలో సంపద సృష్టించే వారితోపాటు దేశం కోసం కష్టపడే శ్రమజీవులను కూడా తాను సమానంగా గౌరవిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏ ఒక్కరికైనా తాను తప్పుడు పద్ధతిలో ప్రయోజనం కలిగించేలా ప్రయత్నించి ఉంటే, నీతి నిజాయతీ తప్పి వ్యవహరించి ఉంటే.. తనను ఉరి తీయొచ్చన్నారు. సంపద సృష్టించేవారిని గౌరవించడంలో తాను సిగ్గు పడబోనని స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. బీజేపీ సర్కారు కొందరు ఇండస్ట్రియలిస్టులకు అనుకూలంగా మాత్రమే పని చేస్తోందంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ‘‘అప్పట్లో నెహ్రూ సర్కారును కూడా ‘బిర్లా టాటా సర్కార్’ అంటూ పార్లమెంట్ లోనే ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు అదే కుటుంబం నాపై అదే దుష్ప్రచారం చేయాలని చూస్తోంది” అని విమర్శించారు.
రాజ్యాంగం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం
రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తాను ప్రాణాన్ని త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని మోదీ చెప్పారు. నిజానికి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నేతలే అనేక సార్లు మార్చేశారన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు. ‘‘కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఎన్నో సార్లు మార్చారు. నెహ్రూతో మొదలుకొని ఆయన బిడ్డ ఇందిరాగాంధీ, ఆమె కొడుకు రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని మారిస్తే.. రాహుల్ గాంధీ ఏకంగా రాజ్యాంగాన్ని చించేసి అవమానించారు” అని మోదీ ఫైర్ అయ్యారు. ‘‘నెహ్రూ మొదటగా భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించేందుకు రాజ్యాంగానికి సవరణ తెచ్చారు. ఆయన బిడ్డ ఇందిరాగాంధీ తన ఎంపీ పదవిని కాపాడుకోవడం కోసం కోర్టు తీర్పునే తోసిపుచ్చేలా రాజ్యాంగానికి సవరణ చేశారు. ఉవ్వెత్తున ఉద్యమం రావడంతో ఎమర్జెన్సీ పెట్టారు. షా బానో కేసులో తీర్పును తోసిపుచ్చేందుకు రాజీవ్ గాంధీ కూడా రాజ్యాంగ సవరణ చేశారు. తద్వారా పత్రికా స్వేచ్ఛను హరించారు. యూపీఏ హయాంలో రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధమైన కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన ప్రతిని చించేసి, రాజ్యాంగాన్ని అవమానించారు” అని ప్రధాని వివరించారు.
థర్డ్ టర్మ్ లో 125 రోజుల ప్లాన్
తాను మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులతో ప్లాన్ ను సిద్ధం చేసుకున్నానని ఇదివరకే పలు ఎన్నికల ర్యాలీల్లో ప్రకటించిన మోదీ.. తాజాగా అది 125 రోజుల ప్లాన్ అని వెల్లడించారు. ‘‘దేశంలోని యువత, ఫస్ట్ టైం ఓటర్లలో ఉత్సాహం చూసిన తర్వాత.. నేను 125 రోజుల ప్లాన్ తయారు చేసుకున్నా. ఇదివరకే 100 రోజుల ప్లాన్ సిద్ధం చేసుకోగా.. ఇప్పుడు మరో 25 రోజులను యాడ్ చేశా” అని ఆయన తెలిపారు. హిందూ, ముస్లిం అంటూ తాను ఎన్నడూ మత రాజకీయాలు చేయలేదని మోదీ స్పష్టం చేశారు. తాను ట్రిపుల్ తలాక్ తప్పు అంటే.. తనను యాంటీ ముస్లింగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఐదేండ్ల పాటు ఏటా ఏవో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ సాగు తుంటే దేశంలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానాన్ని తెచ్చి.. ఐదేండ్లలో ఆరు నెలల్లో ఎన్నికల ప్రక్రియను ముగిస్తే మిగతా నాలుగున్నరేండ్లు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు వీలవుతుందన్నారు.
2014కు ముందు ఈడీ నిరుపయోగంగా ఉండేది
బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను మోదీ ఖండించారు. నిజానికి 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరుపయోగంగా ఉండిపోయిందన్నారు. బీజేపీ పాలనలోనే ఈడీ బాగా పని చేస్తోందన్నారు. 2004 నుంచి 2014 వరకూ ఈడీ కేవలం రూ. 35 లక్షలు మాత్రమే సీజ్ చేసిందని.. కానీ తమ హయాంలో రూ. 2,200 కోట్లను సీజ్ చేసిందన్నారు. కండ్ల ముందే నోట్ల కట్టలు సీజ్ చేస్తుంటే.. ఈడీ అధికారులను ప్రతిపక్షాలు క్రిమినల్స్ మాదిరిగా చూడటం దారుణమన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కలిసి సీజ్ చేసిన డబ్బు రూ. 1.25 లక్షల కోట్ల మేరకు ఉందన్నారు. ఈ డబ్బునంతా పేదలకు పంచేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మోదీ చెప్పారు. ఇందుకోసం లీగల్ ఎక్స్ పర్ట్స్ తో సంప్రదింపులు కొనసాగిస్తోందన్నారు. ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు భూములు రాయించుకుని ఉద్యోగాలు ఇచ్చారని, తాము ఆ భూములను తిరిగి యజమానులకు ఇప్పిస్తామన్నారు.