
- బెంగళూరులో గరిష్టంగా 19 శాతం
- హైదరాబాద్‌లో 9 శాతం పైకి
- వెల్లడించిన తాజా రిపోర్ట్.
న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి, మార్చి మధ్యకాలంలో మనదేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇండ్ల ధరలు సగటున వార్షికంగా 10 శాతం పెరిగాయి. బెంగళూరులో గరిష్టంగా 19 శాతం ఎగిశాయి. ఈ ఎనిమిది నగరాల్లో ధరలు 4 శాతం నుంచి 19 శాతం వరకు పెరిగాయని రియల్టర్ల సంస్థ క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా, డేటా అనలిటిక్ సంస్థ లియాసెస్ ఫోరాస్ సంయుక్త రిపోర్ట్‌లో తెలిపాయి.
బెంగళూరులో ఇండ్ల ధరలు సగటున చదరపు అడుగుకు రూ.10,377కి చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో చదరపు అడుగు రూ.8,748గా ఉంది. లియాసెస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ బెంగళూరుతో పాటు ఢిల్లీ–ఎన్‌సీఆర్, హైదరాబాద్, పూణేలలో గణనీయమైన పెరుగుదల ఉందని ఆయన తెలిపారు. తక్కువ ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు కారణంగా డిమాండ్ ఇక నుంచి కొనసాగవచ్చని అన్నారు.
ధరలు మరో10–15 శాతం పెరగవచ్చని కపూర్ చెప్పారు. క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడుతూ ప్రీమియం, లగ్జరీ హౌసింగ్లకు దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్ ఉందని చెప్పారు.
నగరాల వారీగా ధరల పెరుగుదల
ఢిల్లీ-–ఎన్‌సీఆర్‌లో ఇండ్ల ధరలు 16 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.9,757కు చేరుకున్నాయి. అహ్మదాబాద్, పూణేలలో రేట్లు వార్షికంగా 13 శాతం పెరిగి వరుసగా చదరపు అడుగుకు రూ.7,176, చదరపు అడుగుకు రూ.9,448కి చేరాయి. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.11,323కి చేరుకోగా, చెన్నైలో ధరలు 4 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.7,710కి చేరుకున్నాయి.
ముంబైలో ధరలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.20,361కి చేరుకున్నాయి. కోల్‌కతాలో ధరలు చదరపు అడుగుకు రూ.7,211 నుంచి 7 శాతం పెరిగి రూ.7,727లకు చేరుకున్నాయి.