హైదరాబాద్, వెలుగు: కొత్తగా పట్టా పాస్ బుక్స్ వచ్చిన రైతులకు కూడా ఈ వానాకాలం రైతుబంధు కోసం అవకాశం కల్పించారు. జూన్ 5 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. పట్టాదారు పాస్ బుక్, ఆధార్ , బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. ఆదివారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
సీసీఎల్‌ఏ డేటా ఆధారంగా రైతుల గుర్తింపు
సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టా పాస్‌బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. నిరుడు వానాకాలంలో కొత్త వారి పేర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్త వారికి చాన్స్ ఇవ్వలేదు. 2021 జూన్ 10 నుంచి 2022 జూన్ 5 వరకు జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల డేటాను వ్యవసాయశాఖకు సీసీఎల్ఏ తాజాగా అందించింది. ఈ డేటా ఆధారంగా ఏఈవోలు కొత్త వారి పేర్లను రైతుబంధు కోసం పోర్టల్‌లో ఎంట్రీ చేయనున్నారు.
మరో 3 లక్షల మంది పెరిగే చాన్స్
గత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులకు రూ. 7,411.52 కోట్లు రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేశారు. భూయాజమాన్య హక్కుల మార్పులు, చేర్పులతో ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య మరో 3లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
గడువు తక్కువే.. అయినా..?!
ఈ నెల 28 నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ఒకటీ రెండు రోజులే కొత్తవారి పేర్ల ఎంట్రీకి గడువు మిగిలి ఉంది. దీంతో గత ఏడాదిగా వచ్చిన కొత్త పాస్బుక్స్ను ఎంట్రీ చేయడం ఏఈవోలకు సమస్యగా మారుతున్నది. నెల రోజులుగా పట్టించుకోకుండా కేవలం రెండు రోజుల టైమ్ ఇవ్వడం పట్ల ఏఈవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతున్నా.. మరోవైపు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అగ్రికల్చర్ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి.
