గండ్లు పడడం సహజమే.. అర్ధచంద్రాకారంలో కట్ట వేస్తే సరిపోతది: నిరంజన్ రెడ్డి

గండ్లు పడడం సహజమే.. అర్ధచంద్రాకారంలో కట్ట వేస్తే సరిపోతది: నిరంజన్ రెడ్డి
  • అట్లనే మేడిగడ్డలో కట్టలు కట్టి నీళ్లు స్టోర్ చేయొచ్చని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: చెరువులు, కుంటలకు గండ్లు పడడం సహజమేనని, గండి పడిన చోట అర్ధచంద్రాకారంలో కట్ట వేసి నీళ్లు నిల్వ చేయొచ్చునని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. అలాగే, మేడిగడ్డ బ్యారేజీ విషయంలోనూ కట్టలు కట్టి, నీళ్లు నిల్వ చేయొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజనీర్లను అడిగితే ఎలా చేయాలో చెబుతారని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రాణహిత నుంచి 5 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నదని, ఆ నీటిని కాళేశ్వరం పంపులు, రిజర్వాయర్ల ద్వారా సాగుకు అందించాలన్నారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీకి రెండు మూడు చోట్ల వచ్చిన పగుళ్లను భూతద్దంలో చూపించి, గత ప్రభుత్వంపై బురద జల్లడానికి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల పరిష్కారం గురించి మాట్లాడకుండా, పదే పదే కాళేశ్వరం గురించే మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ తప్పు జరిగింది అనుకుంటే, విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ఆలేరు నుంచి మెడికల్​ కాలేజీ తరలించొద్దు

తమపై కోపంతో రైతుల పొలాలను ఎండబెట్టొద్దని.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విమర్శంచడం ఆపి, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని నిరంజన్​రెడ్డి సూచించారు. ఇప్పటికే రైతులు కరెంట్ కోసం సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తున్నారన్నారు. మూడెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు రైతు భరోసా డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారన్నారు. హామీలన్నీ అమలు చేసేదాకా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గిల్లితే, బీజేపీకి నొప్పి పుడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిలదీసిన బీజేపీ, ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటోందని ప్రశ్నించారు. ఆలేరు నుంచి మెడికల్ కాలేజీని కొడంగల్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారు. ఈ ఆలోచనను విరమించుకుని ఆ కాలేజీని ఆలేరులోనే కొనసాగించాలని, కొడంగల్‌‌‌‌‌‌‌‌లో కొత్త కాలేజీని మంజూరు చేసుకోవాలన్నారు. న్యూట్రిషన్ కిట్లు ఇస్తరో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.