Chiranjeevi: మెగాస్టార్ మాస్ ర్యాంపేజ్..109 కేంద్రాల్లో 'మన శంకర వరప్రసాద్ గారు' హాఫ్ సెంచరీ!

Chiranjeevi: మెగాస్టార్ మాస్ ర్యాంపేజ్..109 కేంద్రాల్లో 'మన శంకర వరప్రసాద్ గారు' హాఫ్ సెంచరీ!

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన సునామీ కొనసాగుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో ఇంకా రన్ అవుతోంది.  నేటితో ( మార్చి 2, 2026 ) 109 కేంద్రాల్లో 50 రోజులను విజయవంతంగా పూర్తిచేసుకుని హాఫ్ సెంచరీ కొట్టింది. దీంతో అభిమానులు, చిత్ర యూనిట్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

రికార్డుల వేటలో మెగాస్టార్..

ఈ చిత్రం కేవలం 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు, కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 400 కోట్ల క్లబ్లో చేరినట్లు సమాచారం. మెగాస్టార్ కెరీర్‌లోనూ, అటు మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్‌లోనూ ఇది మొట్టమొదటి. కేవలం 25 రోజుల్లోనే రూ. 375 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన ఈ చిత్రం మేకర్స్ కూడా గతంలో ప్రకటించారు. ఆ లెక్కన లాంగ్ రన్‌లో సుమారు రూ. 395 కోట్ల నుండి రూ. 400 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

సెంటర్ల లెక్కలివే!

మేకర్స్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో 97 సెంటర్లు, తెలంగాణలో 5, కర్ణాటకలో 6, ఒరిస్సాలో 1 సెంటర్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం'  చిత్రం 92 కేంద్రాల్లో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు మెగాస్టార్ ఆ రికార్డును సునాయాసంగా అధిగమించారు. 

మల్టీస్టారర్ మ్యాజిక్..

ఈ విజయంలో విక్టరీ వెంకటేష్ పాత్ర అత్యంత కీలకం. చిరంజీవి, వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం మెగా , దగ్గుబాటి అభిమానులకే కాకుండా సామాన్య ప్రేక్షకులకు కూడా కంటి పండగలా అనిపించింది. నయనతార నటన సినిమాకు మరింత హుందాతనాన్ని తెచ్చిపెట్టింది. షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.

OTTలోనూ అదే జోరు..

సాధారణంగా సినిమాలు ఓటీటీలోకి రాగానే థియేటర్లలో సందడి తగ్గిపోతుంది. కానీ ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, థియేటర్ల వద్ద జనం తగ్గకపోవడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా రికార్డులు సృష్టించింది, కేవలం నార్త్ అమెరికాలోనే దాదాపు 3.5 మిలియన్ల డాలర్లు వసూళ్లను సాధించింది. బుక్‌మై షోలో రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తానికి, ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ సరైన మోతాదులో కుదిరితే మెగాస్టార్ రేంజ్ ఏంటో 'మన శంకర వరప్రసాద్ గారు' మరోసారి నిరూపించిందని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.