తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టనున్నట్టు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నామని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డీసీసీ చీఫ్ లకు సూచించారు రాహుల్ . తెలంగాణలో పార్టీ.. ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ అన్నారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి ఇవాళ రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణు గోపాల్, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్, వైఎస్ షర్మిల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భం గా రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వీహెచ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడారు. ఈ సమయంలో బీసీ కులగణన పూర్తి చేశామని, దానిని అమలు చేసేందుకు పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టాలని కోరగా.. రాహుల్ సానుకూలంగా స్పందించారు.
ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగా విధానం సక్రమంగా లేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. మోడీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ తో ప్రమాదం ఉందన్నారు.
