యుద్ధంతో దలాల్ స్ట్రీట్ రక్తపాతం.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు నష్టపోయిన దేశీయ ఇన్వెస్టర్లు

యుద్ధంతో దలాల్ స్ట్రీట్ రక్తపాతం.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు నష్టపోయిన దేశీయ ఇన్వెస్టర్లు

దలాల్ స్ట్రీట్ చరిత్రలో 2026 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతోంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు రక్తపతాన్ని చవిచూశాయి. కేవలం ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. నిఫ్టీ 1.2 శాతం పతనమై సెప్టెంబర్ 2025 నాటి కనిష్ట స్థాయికి చేరుకోగా.. గత 42 సెషన్లలో సెన్సెక్స్ 6.5 శాతం మేర నష్టపోయింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం, దేశీయ కంపెనీల నీరసించిన ఆర్థిక ఫలితాలు భారత మార్కెట్లను ప్రపంచంలోనే అత్యంత చెత్త పర్ఫామెన్స్ కనబరిచిన మార్కెట్‌గా మార్చాయి.

ముఖ్యంగా ఐటీ రంగం ఈ పతనంలో ముందు వరుసలో ఉంది. ఏఐ సవాళ్లను తట్టుకోవడంలో దేశీయ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ విఫలమవుతున్నాయన్న ఆందోళనల మధ్య ఈ షేర్లు జనవరి నుండి 11 నుంచి 30 శాతం వరకు కుప్పకూలాయి. మరోవైపు.. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య తర్వాత మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ముడిచమురు ధరలను 8 నెలల గరిష్టానికి చేర్చాయి. భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉండటం.. అందులోనూ 50 శాతం చమురు హార్ముజ్ జలసంధి గుండానే రావాల్సి ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థపై యుద్ధం నేరుగా ప్రభావం పడుతోంది.

ఈ యుద్ధ సెగలు వివిధ రంగాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. విమానయాన రంగ దిగ్గజం ఇండిగో షేర్లు 12 నెలల కనిష్టానికి పడిపోగా.. మధ్యప్రాచ్యంలో భారీ ఆర్డర్లు కలిగిన ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ స్టాక్ 5 శాతం నష్టపోయింది. ముడిచమురు ధరలతో ముడిపడి ఉన్న పెయింట్, టైర్ కంపెనీలతో పాటు బాస్మతీ బియ్యం ఎగుమతి చేసే సంస్థల షేర్లు కూడా భారీగానే పతనమయ్యాయి. మార్కెట్లలోని మొత్తం 800 షేర్లు తమ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతానికి మార్కెట్ వ్యాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయని.. 55 శాతానికి పైగా షేర్లు 30 కన్నా ఎక్కువ P/E రేషియోతో ట్రేడ్ అవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అయితే.. ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కూడా ఇస్తుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. గత మూడు దశాబ్దాల డేటాను పరిశీలిస్తే.. గల్ఫ్ యుద్ధాలు, కార్గిల్ పోరు లేదా ఇతర అంతర్జాతీయ ఉద్రిక్తతల తర్వాత భారత మార్కెట్లు ఎప్పుడూ మరింత బలంగా కోలుకున్నాయి. అందుకే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏఐ ప్రభావం తక్కువగా ఉండే రక్షణ రంగం, షిప్పింగ్ కార్పొరేషన్, గార్డెన్ రీచ్ వంటి సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. మార్కెట్ కరెక్షన్ పూర్తయ్యాక, పటిష్టమైన ఆదాయాలు కలిగిన కంపెనీలు మళ్లీ హైలైట్ అవుతాయని మార్కెట్ దిగ్గజం సునీల్ షా వంటి వారు అభిప్రాయపడుతున్నారు.