బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్న‌ల్.. మార్గ‌ద‌ర్శ‌కాల‌ జారీ

బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్న‌ల్.. మార్గ‌ద‌ర్శ‌కాల‌ జారీ

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా మార్చి 25న కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించ‌డంతో నాటి నుంచి అన్ని స్కూళ్లు, కాలేజీలు మూత‌ప‌డ్డాయి. గుంపులుగా చేరితే వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌య్యే ప్ర‌మాదం ఉండ‌డంతో టెన్త్, 12వ త‌ర‌గ‌తుల బోర్డ్ ఎగ్జామ్స్ స‌హా అన్ని ర‌కాల ప‌రీక్ష‌లను రాష్ట్ర ప్ర‌భుత్వాలు వాయిదా వేశాయి. లాక్ డౌన్ మొద‌ల‌య్యే స‌మ‌యానికే కొన్ని ప‌రీక్ష‌లు పూర్తిగా కాగా.. మిగిలిన వాటిని ఎప్పుడు నిర్వ‌హిస్తారా అని విద్యార్థుల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఇటీవ‌ల ఒక్కో ప‌లు రాష్ట్రాలు, సీబీఎస్ఈ పెండింగ్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌న్నద్ధం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిలిచిపోయిన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణకు కేంద్ర హోంశాఖ అనుమ‌తి ఇచ్చింది. 10, 12 త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేయాల‌ని విజ్ఞ‌ప్తులు రావ‌డంతో విద్యార్థుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని అనుమ‌తి ఇస్తున్న‌ట్లు తెలుపుతూ ఉత్త‌ర్వులు జారీ చేశారు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెట‌రీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేశారు.

రాష్ట్రాలు విద్యార్థుల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు పెట్టొచ్చు

క‌రోనా లాక్ డౌన్ తో నిలిచిపోయిన పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇచ్చిన కేంద్ర హోం శాఖ‌.. ఆ స‌య‌మంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల‌లో ప‌రీక్ష కేంద్రాల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఏర్పాటు చేయొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని సూచించింది. పరీక్ష కేంద్రాలలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్, సామాజిక దూరం పాటించేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పింది. విద్యార్థుల‌ను ప‌రీక్ష కేంద్రాల‌కు చేర‌వేసేందుకు రాష్ట్రాలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయవచ్చని తెలిపింది.