కొత్త పంచాయతీల్లో తప్పని తిప్పలు

కొత్త పంచాయతీల్లో తప్పని తిప్పలు

హైదరాబాద్, వెలుగు: ఒక్క ఊరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ గ్రామపంచాయతీల పరిస్థితి మొత్తం ఇదే విధంగా ఉంది. గత ఏడాది ఆగస్టు నెలలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 500 జనాభా కలిగిన 4,383 గ్రామాలను పంచాయతీలుగా మార్చింది. కొత్త పంచాయతీల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువవ్వడంతో పాటు ప్రజాప్రతినిధుల్లో బాధ్యత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. పంచాయతీలు ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉన్నా వాటికి కనీస సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కొత్త పంచాయతీలు ఏర్పడి ఆగస్టు 1తో ఏడాది పూర్తయినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కన్పించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

భవనాలు లేక… నిధులు రాక

గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడి ఏడాది పూర్తయినా ఏ ఒక్క జీపీకి కూడా సొంత భవనం సమకూరలేదు. చాలా గ్రామాల్లో మూతపడిన ప్రభుత్వ స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలోనే జీపీ ఆఫీస్​ఏర్పాటు చేశారు. అలాంటి అవకాశం లేనిచోట కిరాయి భవనాల్లో నిర్వహిస్తున్నారు.  ఆయా గ్రామాల్లో ఉన్న డిమాండ్​బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకు కిరాయిని సర్పంచులు చెల్లిస్తున్నారు.  గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారినచోట సమస్య  తీవ్రంగా ఉంది. కిరాయికి పక్కా భవనాలు లేకపోవడంతో గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలలో గుడిసెల్లోనే జీపీని నిర్వహిస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు కొలువుదీరాక పంచాయతీల నిర్వహణ బాధ్యత అంతా సర్పంచులపైనే పడింది. పంచాయతీ భవనానికి అవసరమయ్యే ఫర్నీచర్​కూడా సర్పంచులే కొనుగోలు చేశారు. జీపీకి అవసరమయ్యే టేబుళ్లు, కుర్చీలకు దాదాపుగా ఒక్కో సర్పంచికి రూ.20 వేల వరకు ఖర్చయ్యాయి. ఫర్నీచర్​ కొనుగోలు, జీపీ కిరాయితో పాటు ఇతరత్రా నిర్వహణ ఖర్చుల కోసం ఇప్పటి దాకా రూ.లక్ష వరకు అయినట్లు సర్పంచులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో అప్పులు తెచ్చి మరీ జీపీ నిర్వహణకు వెచ్చిస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీల కోసం కిరాయిని చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు చాలావరకు అధికార పార్టీకి చెందినవారే సర్పంచులుగా ఉండడంతో వారి బాధల్ని బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతున్నారు.

ప్రతిపాదనలకే పరిమితం

కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలను నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచన ప్రతిపాదనలకే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన 4,383 జీపీలకు ఒకేసారి కొత్త భవనాలను నిర్మించడం కష్టమని ప్రభుత్వం భావించింది.
మూడు విడతలుగా వీటిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కానీ ప్రభుత్వ అధికారుల ఆలోచన కేవలం కాగితాలకే పరిమితమైంది. కొత్త గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం కోసం జిల్లా పంచాయతీ అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారు. కానీ ఆ ప్రతిపాదనలు జిల్లా స్థాయిలోనే ఆగిపోయాయి.

– జనగామ జిల్లాకు చెందిన అధికార పార్టీ సర్పంచి ఆవేదన ఇది.

కమ్యూనిటీ హాల్​లో నిర్వహిస్తున్నాం

మాది కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ. జీపీకి సొంత భవనం లేదు. ఊర్లోనే కమ్యూనిటీ హాల్​లో ఏర్పాటు చేశాం. గ్రామసభల సమయంలో, ఇతర సమయాల్లో ఇబ్బందిగా ఉంది. కొత్త గ్రామపంచాయతీలకు నిధులు కేటాయిస్తానని ప్రభుత్వం చెప్పినా ఇంతవరకు మంజూరు చేయలేదు. అప్పులు తెచ్చి ఊర్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర పనులు చేస్తున్నాం. సొంత భవనాన్ని నిర్మించడంతో పాటు గ్రామపంచాయతీకి వెంటనే నిధులు కేటాయించాలి.

– సనాది సబితభాస్కర్, లెనిన్​నగర్, ​ సర్పంచ్, కొమురవెల్లి మండలం,
సిద్దిపేట జిల్లా