- లోక్ సభలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో బంజారాతో పాటు ఇతర భాషలను చేర్చేందుకు ఎలాంటి నిర్దిష్ట ప్రామాణికాలు లేవని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భాషలు, మాండలికాల పరిణామం అనేది సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలతో కూడుకున్నదని తెలిపింది. అంతేకాకుండా ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొంది.
అందుకే నిర్దిష్ట నిబంధనలు ఖరారు చేయడం కష్టమని వెల్లడించింది. గతంలో పహ్వా (1996), సీతాకాంత్ మహాపాత్ర (2003) కమిటీలు చేసిన ప్రయత్నాలు కూడా ఈ విషయంలో స్పష్టతను ఇవ్వలేకపోయాయని తెలిపింది. అయినప్పటికీ బంజారా, ఇతర వర్గాలకు చెందిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
