దశాబ్దాల పాటు బుల్లితెరపై తనదైన గలగలా మాటలతో అలరించి 'హృదయభాను'గా నిలిచిన యాంకర్ ఉదయభాను. ఇప్పుడు ఆమె ఓటీటీ ప్రపంచంలోకి తన నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకూ నటిగా, సమర్థవంతమైన వ్యాఖ్యాతగా మెప్పించిన ఆమె.. తొలిసారి నిర్మాతగా మారారు. లేటెస్ట్ గా హై-వోల్టేజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పంచనామా' (Panchanama) అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించారు.
యాంకర్ నుంచి నిర్మాతగా..
తమిళ నటుడు భరత్ ప్రధాన పాత్రలో, మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' (ZEE5) లో సెప్టెంబర్ 11 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకోంటుంది. లేటెస్ట్ గా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఉదయభాను పంచుకున్న భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ..
ఈ ఈవెంట్లో ఉదయభాను మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక నిర్మాతగా మారేందుకు దాదాపు 15 ఏళ్లుగా తపస్సు చేశాను. నా ప్రయాణం టెలివిజన్‌లోనే మొదలైంది, అందుకే టీవీ డిజిటల్ వేదికగానే ప్రాజెక్ట్ ప్రారంభించాలని భావించాను. ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ప్రశాంతంగా రెండు గంటలు నిద్రపోని రోజులున్నాయి. చివరకు 'జీ5' నా కలకు ప్రాణం పోసింది అని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కథ పట్టుకుని కొందరు హీరోల దగ్గరకు వెళ్తే, సిరీస్ మొత్తానికి అయ్యే బడ్జెట్‌ను తమ రెమ్యునరేషన్‌గా అడిగారని, ఆ సవాళ్లను దాటుకుని ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.
గాడ్ ఫాదర్లు లేరు..
12 ఏళ్ల చిన్న వయసులోనే చేతిలో మైక్ పట్టి స్వయంకృషితో ఎదిగానని ఉదయభాను గుర్తుచేసుకున్నారు. తనకు ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ప్రేక్షకుల ప్రేమే తనను నిలబెట్టిందన్నారు. ఎన్నోసార్లు కిందపడినా రెట్టింపు ఉత్సాహంతో లేచి నిలబడ్డానని స్పష్టం చేశారు.
ఎవరి దగ్గరైనా నిజమైన టాలెంట్, కంటెంట్ ఉంటే ధైర్యంగా రండి. ఏ తలుపులు మూసుకుపోయినా 'ఉదయభాను ప్రొడక్షన్స్' తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని ఆమె పిలుపునిచ్చారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించలేనిది లేదు అని ఉదయభాను అన్నారు. ఇప్పడు 'పంచనామా' సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
